నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి

  • ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి వచ్చే అవకాశం..
  • అధికారులకు అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచన

దండేపల్లి, ఆంధ్రప్రభ: ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తుగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రయ్య సూచించారు. గ్రామాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టే నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సర్పంచులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.

బుధవారం దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన సుమారు ఎనిమిది గంటల పాటు పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. వీబీజీ రాంజీ పథకం కింద ఇంకుడు గుంతలు, వ్యవసాయ కుంటలు, నీటి తొట్టెలు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. రెబ్బనపల్లిలో వ్యవసాయ కుంట నిర్మాణ పనులను పరిశీలించి ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. లింగాపూర్, మాకూలపేట అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న కందకాల పనులను తనిఖీ చేశారు.

లింగాపూర్‌లో మిషన్ భగీరథ తాగునీటి సమస్యపై కూలీలు ఫిర్యాదు చేయడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతిరోజూ కూలీల హాజరును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.

అనంతరం గూడెం పుష్కర ఘాట్ పనులు, జిల్లా పరిషత్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. వెల్గనూరులో ఇంకుడు గుంతలు, ద్వారకలో పాఠశాల పనులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను తనిఖీ చేశారు. పనుల్లో జాప్యం లేకుండా వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఎంపీడీవో జాగర్లమూడి ప్రసాద్, మిషన్ భగీరథ ఏఈ అచ్యుత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.