అధ్యయనానికి ప్రాధాన్యమివ్వాలి..

  • ‘దర్పణ స్వరాలు’ కవితా సంకలనం ఆవిష్కరణలో డా. ఏనుగు నరసింహారెడ్డి
  • కొత్త కవులను ప్రోత్సహిస్తున్న దర్పణం సాహిత్య వేదిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కవులు నిరంతరం అధ్యయనం చేస్తూ సాహిత్యరంగంలో వస్తున్న నూతన పోకడలను అవగాహన చేసుకోవాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా. ఏనుగు నరసింహారెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దర్పణం సాహిత్య వేదిక, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘దర్పణ స్వరాలు’ కవితా సంకలనాన్ని ఆయన కాళోజీ పురస్కార గ్రహీత, ప్రముఖ కవి డా. అమ్మంగి వేణుగోపాల్‌తో కలిసి ఆవిష్కరించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమానికి దర్పణం సాహిత్య వేదిక అధ్యక్షుడు డా. రాయారావు సూర్యప్రకాశ్‌రావు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా డా. ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. సాహిత్య రంగంలో వస్తున్న మార్పులు, ప్రయోగాలను కవులు గమనించాలని, నిరంతర సాధనతో తమ రచనా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అన్నారు. కొత్త కవులను ప్రోత్సహిస్తూ దర్పణం సాహిత్య వేదిక చేస్తున్న కృషిని అభినందించారు.

సామాజిక అంశాలపై రచనలు రావాలి

తెలంగాణ సాహిత్య అకాడమీ కవులు, రచయితల సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తోందని అకాడమీ కార్యదర్శి డా. ఎన్‌. బాలాచారి తెలిపారు. కవులు సామాజిక అంశాలపై దృష్టి సారించి రచనలు చేయాలని ప్రముఖ కవి, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ మాజీ అధ్యక్షుడు యాకూబ్‌ సూచించారు. సాహిత్య రంగంలో వస్తున్న ప్రయోగాలను పరిశీలిస్తూ కవులు తమ రచనల్లో కొత్తదనానికి ప్రాధాన్యమివ్వాలని సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ డైరెక్టర్‌ జువ్వాడి దేవీప్రసాద్‌ అన్నారు.

ప్రముఖులకు స్మారక పురస్కారాలు

దర్పణం సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యురాలు దివంగత కొప్పరపు తాయారుకు ‘దర్పణ స్వరాలు’ గ్రంథాన్ని అంకితం చేశారు. ఈ పుస్తకాన్ని ఆమె మనుమడు కొప్పరపు చంద్రమోహన్‌ రిష్వంత్‌ స్వీకరించారు. కొప్పరపు తాయారు స్మారక పురస్కారాలను ప్రముఖ విద్యావేత్త డా. పసుల లక్ష్మారెడ్డి, ప్రముఖ నటుడు వెంపటి కామేశ్వరరావులకు అందజేశారు. ముదిగొండ సంతోష్‌ కవితా సంకలనాన్ని పరిచయం చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ పూర్వ సంయుక్త సంచాలకురాలు పి. సరోజినీదేవి, కవులు డా. చీదెళ్ల సీతాలక్ష్మి, సత్యవీణ మొండ్రేటి, రామకృష్ణ చంద్రమౌళి, నక్క హరికృష్ణ, గుండం మోహన్‌రెడ్డి, అరుణజ్యోతి, అరుణా పరంధాములు, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్‌, ఇమ్మడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సత్యమూర్తి, గుండం మోహన్‌రెడ్డి, హరికృష్ణ నిర్వహణలో కవి సమ్మేళనం జరిగింది. కార్యక్రమం ముగింపులో పుస్తక సమీక్షకులకు, కవితలు రాసిన కవులకు ప్రశంసాపత్రాలు అందజేసి శాలువాలతో సత్కరించారు.