ప్రధాని అభివృద్ధి అస్త్రం

ప్రధాని అభివృద్ధి అస్త్రం

రూ.13,430 కోట్లతో శ్రీకారం

(ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి ) : దక్షిణ భారత దేశంలో..బలమైన పునాది కోసం అటు కాషాయదళం కళ్లు కాయలు కాస్తుంటే.. ఇటు ఆంధ్రావనిలో అభివృద్ధి కోసం జనం తపించిపోతున్న తరుణంలో.. త్రిదళం చేతిలో అభివృద్ధి అస్త్రం తెరమీదకు వచ్చింది. ఇదే ప్రధాని మోదీ సంధించే బ్రహ్మాస్త్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల హారంలో ఓ మణిపూస మల్లన్న అధిష్టించిన శ్రీశైలం క్షేత్రానికి ప్రధాని నరేంద్ర రాక సందర్భంగా.. రాబోయే స్థానిక పోరులో తమ సత్తా చాటుకోవటానికి త్రిదళాలు కసరత్తులు ప్రారంభించాయి. ఆయన సంధించే ఏకైక అభివృద్ధి మంత్రోచ్చరణతో… ఇటు రాయలసీమ జనం , అటు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జనం పరవశులు కావటం తథ్యం. ఇప్పటికే ఏపీలో ప్రధాని పర్యటనను జయ ప్రదం చేసేందుకు కూటమి ప్రభుత్వం తన త్రిదళ సైన్యాన్ని రంగంలోకి దించింది. మరి కొన్ని గంటల్లో ప్రధాని మోదీ రాయలసీమ గడ్డపై అడుగు పెట్టటమే కాదు.. ఏపీలో రూ.13,430 కోట్ల వ్యయంతో.. అనేక అభివృద్ధి పనులను జాతి అంకితం చేస్తారు. అనేక పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఈ సందర్భంగా.. ప్రధాని మోదీ కురిపించే వరాల వర్షంలో తడచి ముద్దగా మారి చిందులోసేందుకు రాయలసీమ త్రిదళం ఎదురు చూస్తోంది. గురువారం నంద్యాల, కర్నూలు జిల్లాల్లో జరిగే.. ఈ రాజకీయ వికసిత సీమ సందడిలో ఏమి జరుగుతుందంటే.. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్‌ 16న ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వస్తారు. గురువారం ఉదయం 11:15 గంటలకు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో పూజాధికాల్లో పాల్గొంటారు. ఆదిదంపతుల దర్శనం అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ స్మారక కేంద్రం మధ్యలో ధ్యానంలోని ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం, చుట్టూ ప్రతాప్‌ గఢ్‌, రాజ్‌ గఢ్‌, రాయగఢ్‌ , శివనేరి కోటల నమూనాలను తిలకిస్తారు. ఔను 1677లో శివాజీ మహారాజు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించారు. ఈ చారిత్రాత్మ క సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ స్మారకం నిర్మించారు.

కర్నూలులో.. అభివృద్ధి యజ్ఞం
కర్నూలులో మధ్యాహ్నం 2.30 గంటలకు రూ.13,430 కోట్ల విలువైన పలు కీలక ప్రాజెక్టులను శంకుస్థాపన, ప్రారంభం చేసి జాతికి అంకితం చేస్తారు. పరిశ్రమలు, విద్యుత్తు ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం , రైల్వేలు, రక్షణ తయారీ, పెట్రోలియం, సహజ వాయువు రంగాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. జాతికి అంకితం జరుగుతాయి. ఇవి రాష్ట్ర మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి సృష్టి లక్ష్యాలకు దోహదం చేస్తాయి. రూ.2,880 కోట్ల వ్యయంతో కర్నూలు-III పూలింగ్‌ స్టేషన్‌లో విద్యుత్తు సరఫరా వ్యవస్థ బలోపేతం ప్రాజెక్ట్‌’కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇందులో 765 కేవీ డబుల్‌ సర్క్యూట్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ (కర్నూలు III .. -చిలకలూరిపేట) ఏర్పాటు కానుంది. దీని ద్వారా 6,000 ఎంవీఏ విద్యుత్తు సరఫరా సామర్యం పెరగనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా, కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్‌ ఏరియాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఈ రెండు ప్రాజెక్టులను రూ.4,920 కోట్ల తో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డవలప్ మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ ( NICDIT) , ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక వసతుల కల్పన సంస్థ (APIIC) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత రూ.21,000 కోట్ల పెట్టుబడులు, ఒక లక్ష ఉద్యోగాలు రానున్నాయి.

రోడ్లపై కోస్తా పరుగేపరుగు..
ఇక సబ్బవరం నుంచి విశాఖపట్నంలోని శీలానగర్‌ వరకూ ఆరు లేన్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే (రూ.960 కోట్లు) కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రహదారి ట్రాఫిక్‌ రద్దీని తగ్గించి, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెంచుతుంది. రూ.1,140 కోట్లతో ఆరు రహదారి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పీలేరు-.. కలూర్‌ నాలుగు లేన్ల రహదారి, కడప-..నెల్లూరు సరిహద్దు రహదారి విస్తరణ, గుడివాడ .. -నూజెల్ల రైల్వే ఆర్వోబీ , పాపఘ్ని వంతెన, కనిగిరి బైపాస్‌, ఎన్‌.గుండ్లపల్లి బైపాస్‌ విస్తరణ ఉన్నాయి. కొత్తవలస.. -విజయనగరం నాలుగో రైల్వే లైన్‌, పెందుర్తి-.. సింహాచలం నార్త్‌ రైల్వే పైవంతెన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.1200 కోట్లతో పూర్తి చేసిన కొత్తవలస.. -బొడ్డవర, శిమిలిగూడ.. -గోరాపూర్‌ లైన్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.

ఉత్తరాంధ్ర ఆనందో బ్రహ్మ
రూ.1730 కోట్లతో గెయిల్ సంస్థ నిర్మించిన శ్రీకాకుళం .. -అంగుల్‌ నేచురల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ ను జాతికి అంకితం చేస్తారు . ఏపీలో 124 కి.మీ. ఒడిశాలో 298 కి.మీ. ఈ పైప్ లైన్ విస్తరించి ఉంది. చిత్తూరులో రూ.200 కోట్లతో ఇండియన్‌ ఆయిల్‌ నిర్మించిన ఎల్ పీజీ బాట్లింగ్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. ఈ ప్లాంట్ ఏడు జిల్లాల్లో 7.2 లక్షల కుటుంబాలకు వంటగ్యాస్ ను సరఫరా చేస్తుంది. కృష్ణా జిల్లా నిమ్మకూరు వద్ద రూ.360 కోట్లతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిర్మించిన నైట్‌ విజన్‌ పరికరాల తయారీ యూనిట్‌ను జాతికి అంకితం చేస్తారు. ఎనీ హౌ.. ప్రధాని మోదీ రాకతో.. వేలాది కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకుని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ జట్టు సత్తా చాటుతుందంని .. త్రిదళం ఖుషీఖుషీగా ఉంది. కనీసం 3 లక్షల మందిని సభకు తరలించి ప్రధారి మోదీని ప్రసన్నం చేసుకోవాలని … కూటమి నేతలు ఉత్సాహంగా ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

Leave a Reply