murasu| చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్!
చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్!
- ఏపీ పరిస్థితులపై ముఖ్యమంత్రితో మాట్లాడిన మోదీ
- రైతులకు భారీ నష్టం.. రహదారులు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నాయని వివరించిన సీఎం
- సహాయక చర్యలను ప్రశంసించిన ప్రధాని.. కేంద్ర సాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి
ఆంధ్రప్రభ, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ను వరుస తుపాన్లు అతలాకుతలం చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫోన్ చేశారు. రాష్ట్రంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితి, జరిగిన నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ‘అర్నబ్’, ‘మురాసు’ తుపాన్లు రాష్ట్రాన్ని తాకడంతో వివిధ ప్రాంతాల్లో వాటి ప్రభావం, నష్టంపై ప్రధాని ఆరా తీశారు.
రైతులకు భారీ నష్టం
రెండు తుపాన్ల కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానికి వివరించారు. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పంటలకు జరిగిన నష్టంతో పాటు రహదారులు, విద్యుత్ మౌలిక సదుపాయాలు, ఇతర రంగాలపై తుపాన్ల ప్రభావం పడిందని వివరించారు. దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించడంతో పాటు బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం అందించాలని ప్రధానిని కోరారు.
సహాయక చర్యలను ప్రశంసించిన మోదీ
తుపాను సహాయక, పునరావాస చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలను ప్రధాని మోదీ అభినందించారు. తుపాన్ల ముప్పును ముందుగానే గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించడం, విపత్తు సమయంలో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును ప్రశంసించారు. బాధితులకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అభినందించారు.
