ప్రజలతో మమేకం!

ప్రజలతో మమేకమవుతున్న ప్రధాని : కిషన్‌రెడ్డి
హైదరాబాద్ , ఆంధ్రప్రభ బ్యూరో : ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మంత్రి నరేందర్ మోడీ (Prime Minister Narendra Modi) నిర్వహించిన మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి (G. Kishan Reddy) బోరబండ డివిజన్‌లో ప్రజలతో కలిసి వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “ ఆదివారం ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో మనసులోని మాటలను పంచుకుంటున్నారని, గత కొన్నేళ్లుగా విరామం లేకుండా ఈ సంప్రదాయం కొనసాగుతోందని అన్నారు. ఈ రోజు మన్ కీ బాత్ ( Mann Ki Baat)లో ప్రధాని స్వచ్ఛ భారత్ (Swachh Bharat) కార్యక్రమ ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేశారు. బస్తీలు, నగరాలు, దేశం పరిశుభ్రంగా ఉండాలని, పరిశుభ్రతతోనే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెప్పారు.
17న సికింద్రాబాద్‌లో లిబరేషన్ డే
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డే ఘనంగా నిర్వహించనున్నామని, ఆ కార్యక్రమానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతారని అన్నారు. అలాగే విశ్వకర్మ దివస్ ను కూడా జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటామని చెప్పారు. అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు కూడా కావడంతో తెలంగాణలో మూడు ముఖ్యమైన కార్యక్రమాలను ఒకే రోజున నిర్వహిస్తామన్నారు.
మోడీ కుటుంబం ఆదర్శవంతంగా జీవనం కొనసాగించింది!
ప్రధానమంత్రి తల్లి రెండు సంవత్సరాల క్రితం మరణించారని తెలిసినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో పాటు వారి అనుచరులు బీహార్‌లో మోడీ తల్లి గురించి నీచంగా, మానవత్వం లేకుండా మాట్లాడారన్నారు. అలాంటి దుర్మార్గ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. ప్రతి మహిళకు రూ. 2,500 చొప్పున మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) కింద ఇస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా అమలు చేయలేదన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వేల కోట్లు దోచుకుంటున్నారు.. తప్ప మహిళలకు ఒక్క రూపాయి కూడా అకౌంట్లో జమ చేయలేదన్నారు. అటువంటి వారు ఈ రోజు ప్రధాని నరేందర్ మోదీ పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రధానికి సొంత ఇల్లు లేదని, ఆయనకు వ్యక్తిగత వ్యాపారమేమీ లేదని, ఆయన రేషన్ షాపు నడుపుకుంటున్నారని అన్నారు.
