ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రక్షణ కరువు
- సెక్యూరిటీ గార్డు లేక రాత్రివేళ సిబ్బంది బిక్కుబిక్కు
- మద్యం మత్తులో వచ్చేవారితో వైద్య సిబ్బందికి ఇబ్బందులు
- అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదంటున్న సిబ్బంది
బూర్గంపాడు, ఆంధ్రప్రభ: మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే సిబ్బందికి కనీస రక్షణ కల్పించకపోవడంతో కొన్ని కేంద్రాల్లో విధులు నిర్వహించడం సవాల్‌గా మారుతోంది. బూర్గంపాడు మండలంలోని మొరంపల్లి బంజరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెక్యూరిటీ గార్డు లేక వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారని చెబుతున్నారు.
మొరంపల్లి బంజరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ రహదారి పక్కనే ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ఇక్కడికి తీసుకువస్తుంటారు. వారికి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించడం జరుగుతోంది. అంతేకాకుండా ప్రతి నెలా సుమారు 10 నుంచి 15 వరకు ఉచిత ప్రసవాలు జరుగుతుండటంతో ఈ కేంద్రానికి పరిసర ప్రాంతాల్లో మంచి పేరుంది. ఇలాంటి కీలకమైన ఆరోగ్య కేంద్రంలో సెక్యూరిటీ గార్డు లేకపోవడం సిబ్బందికి ఇబ్బందిగా మారింది.
రాత్రి సమయంలో ఇద్దరు మహిళా సిబ్బంది విధుల్లో ఉండే సందర్భాల్లో మద్యం మత్తులో కొందరు ఆసుపత్రికి వస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. వెంటనే వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ, తమకు నచ్చిన విధంగా చికిత్స అందడం లేదంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. మద్యం మత్తులో వచ్చిన కొందరు దురుసుగా మాట్లాడటంతో పాటు విధులకు ఆటంకం కలిగిస్తున్నారని వాపోతున్నారు. దీంతో అర్ధరాత్రి వేళ విధులు నిర్వహించాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన స్థాయిలో డ్యూటీ నర్సులు లేకపోవడంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోందని చెబుతున్నారు. రాత్రివేళ అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించాల్సి రావడంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెక్యూరిటీ గార్డు, అదనపు డ్యూటీ నర్సును ఏర్పాటు చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన స్పందన లేదని స్థానికులు, సిబ్బంది వాపోతున్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఈ కేంద్రంపై జిల్లా వైద్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు. సెక్యూరిటీ గార్డును వెంటనే నియమించడంతో పాటు మరో డ్యూటీ నర్సును కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వైద్య సిబ్బందికి సురక్షిత వాతావరణం కల్పిస్తే మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. జిల్లా వైద్యాధికారులు, కలెక్టర్ స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
