కౌలాస్ కోటకు ప్రతిష్టాత్మక గుర్తింపు
ప్రైవేట్ భాగస్వామ్యంతో కోట అభివృద్ధికి పర్యాటక శాఖ సన్నాహాలు..
ఫలించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కృషి
జుక్కల్, ఆంధ్రప్రభ : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కృషి ఫలించింది. జుక్కల్ మండలంలోని కాకతీయుల కాలం నాటి కౌలాస్ కోట రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణకు త్వరలో చర్యలు చేపట్టనున్నారు. వారసత్వ సంపదను భావితరాల కోసం పరిరక్షిస్తూ కౌలాస్ కోటను అన్ని విధాలా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య విధానం ద్వారా కౌలాస్ ఖిల్లాను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఈ అభివృద్ధి ద్వారా కౌలాస్ ఖిల్లా అన్ని విధాలా అభివృద్ధి చెందే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని పురాతన 11 కోటల్లో జుక్కల్ కౌలాస్ కోట కూడా ఉండటంతో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడిందని చెబుతున్నారు. కౌలాస్ కోటలో అపురూపమైన కట్టడాలు, వాస్తుశిల్పాలు, కళాఖండాలు, బురుజులతో పాటు మందిరాలు, దర్గాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిరంగి కూడా కౌలాస్ కోటలో ఉందని స్థానికులు తెలిపారు.
ఇప్పటివరకు కౌలాస్ కోట అభివృద్ధిపై ఎవరూ పెద్దగా దృష్టి సారించలేదని, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చొరవ తీసుకుని కోట అభివృద్ధికి కృషి చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కౌలాస్ కోట అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
