ఇంద్రకీలాద్రికి రాష్ట్రపతి ముర్ము
రాత్రి 7.10 గంటలకు అమ్మవారి సన్నిధికి రాక..
7.20 నుంచి దర్శనం, పూజలు
అరగంట పాటు సాధారణ దర్శనాలకు అంతరాయం..
వీఐపీ దర్శనాలు నిలిపివేత
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం దర్శించుకోనున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటనకు దేవస్థానం అధికారులు, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యటనకు సంబంధించి అధికారులు, దేవస్థానం సిబ్బంది సమన్వయంతో ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు.
రాత్రి 7.10 గంటలకు రాక
రాష్ట్రపతి బుధవారం రాత్రి 7.10 గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకుంటారని దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ వెల్లడించారు. రాత్రి 7.20 గంటల నుంచి అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. దర్శనం అనంతరం రాత్రి 7.40 గంటలకు రాష్ట్రపతి తిరుగు ప్రయాణమవుతారని వివరించారు.
అరగంట పాటు దర్శనాలకు అంతరాయం
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సుమారు అరగంట పాటు సాధారణ దర్శనాలకు అంతరాయం కలగనుంది. ఈ సమయంలో సామాన్య భక్తులు క్యూలైన్లలోనే కొనసాగుతారని అధికారులు తెలిపారు. రాష్ట్రపతి దర్శనం పూర్తయిన వెంటనే సాధారణ దర్శనాలను యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అమ్మవారి దర్శనం సమయంలో వీఐపీ దర్శనాలను నిలిపివేయనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగడంతోపాటు భక్తులకు ఇబ్బందులు తగ్గించేలా భద్రత, దర్శన ఏర్పాట్లను అధికారులు సమన్వయం చేస్తున్నారు.
