విజయవాడ ఉత్సవాలు.. వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు

విజయవాడ (ఆంధ్రప్రభ): దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడలో దసరా శరన్నవరాత్రుల వైభవాన్ని ప్రతిబింబించేలా ‘విజయవాడ ఉత్సవాలు’ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో ఈ వేడుకలు రూపుదిద్దుకోనున్నాయి.

వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు..

సింగ్‌నగర్‌లోని మకినేని బసవపున్నయ్య స్టేడియం, పున్నమి ఘాట్ తదితర ప్రముఖ ప్రాంతాల్లో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. భక్తులు, ప్రజలను ఆకట్టుకునేలా వైవిధ్యభరితమైన ఆటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వినోద కార్యక్రమాలను అన్ని రకాల హంగులతో సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఆదివారం సింగ్‌నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం టీడీపీ నాయకులు, శ్రేణులతో కలిసి విజయవాడ ఉత్సవాల ప్రచార బ్యానర్లను ఆవిష్కరించారు.

25 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం..

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విజయవాడ నగరం వేదికగా ఈ వేడుకలను అత్యంత అట్టహాసంగా ప్లాన్ చేస్తున్నామని ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు. అమ్మవారి దర్శనార్థం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 25 లక్షల మంది భక్తులు విజయవాడకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నగరానికి వచ్చే భక్తులకు, సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, ఆధ్యాత్మిక అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ విజయవాడ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.