ఎన్నికల అక్రమాలకు పాల్పడిన జగన్..
నేడు ఓటమి భయంతో ఎన్నికలనే రాజకీయం చేస్తున్నారు
కారుచోల, గుత్తావారిపాలెంలో రూ.30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి
యడ్లపాడు, ఆంధ్రప్రభ : సార్వత్రిక ఎన్నికలైనా, స్థానిక ఎన్నికలైనా కూటమిదే విజయమని శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగితే వైసీపీకి డిపాజిట్లు కూడా రావని జగన్‌కు అర్థమైందని అన్నారు. తన అసమర్థతను, భయాన్ని కప్పిపుచ్చుకుంటూ ఓటమి భయంతోనే ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు.
మంగళవారం ఆయన యడ్లపాడు మండలం కారుచోల, గుత్తావారిపాలెం గ్రామాల్లో పర్యటించారు. కారుచోలలో రూ.20 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. రూ.6 లక్షలతో మరమ్మతులు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గుత్తావారిపాలెంలో రూ.10 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.
తన హయాంలో స్థానిక ఎన్నికలు ఎలా జరిగాయో జగన్ మర్చిపోయారా?
తన ప్రభుత్వంలో స్థానిక ఎన్నికలు ఎలా జరిగాయో జగన్ మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదని ప్రత్తిపాటి అన్నారు. ఆనాడు నామినేషన్ల ప్రక్రియ మొదలు ఫలితాల వరకు జరిగిన దారుణాలను మాటల్లో చెప్పలేమన్నారు. 2021లో విడుదలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై అప్పటి హైకోర్టు చేసిన వ్యాఖ్యలను జగన్ ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు.
ఎన్నికల నోటిఫికేషన్ జారీ విధానాన్ని తప్పుపడుతూ ‘డెమోక్రటిక్ బ్యాక్‌స్లైడింగ్’ అనే పదాన్ని ఎందుకు వాడారో జగన్ సమాధానం చెప్పాలన్నారు. పారామిలటరీ బలగాల పర్యవేక్షణ, వెబ్‌కాస్టింగ్, సీసీటీవీ లైవ్‌లు ఏర్పాటు చేయాలని అంటున్న జగన్.. తన ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వీటన్నింటినీ ఎంత సమర్థంగా అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి, ప్రజల మద్దతు లేదని తెలిసినప్పుడు ప్రభుత్వంపై నిందలు వేయడం జగన్‌కే చెల్లిందని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తన జేబు సంస్థగా మార్చుకొని ముఖ్యమంత్రిగా జగన్ నిర్వహించిన స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్య నాణ్యతను పూర్తిగా మసకబార్చాయని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి, ప్రజాబలంతో తిరుగులేని విజయం సాధించి మరోసారి చరిత్ర సృష్టిస్తుందని ప్రత్తిపాటి తెలిపారు. నిన్నటి వరకు బీసీ రిజర్వేషన్ల ముసుగులో కోర్టుల్లో తప్పుడు పిటిషన్లు వేసిన జగన్.. నేడు ఎన్నికల నిర్వహణ అంశాలను రాజకీయం చేస్తూ న్యాయస్థానాలను తప్పుదారి పట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. జగన్ తీరు ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మండల పార్టీ అధ్యక్షుడు కామినేని సాయిబాబు, టీడీపీ నాయకులు మద్దూరి వీరారెడ్డి, వీరాంజనేయులు, గౌస్, సద్దాం, మునాఫ్, బుడే, వెంకట కోటయ్య, కరిముల్లా, గుత్త శ్రీ రామ్మూర్తి, సాంబశివరావు, శివరామకృష్ణ, డీఎంహెచ్ఓ మన్మోహన్, ఎమ్మార్వో విజయశ్రీ, పీహెచ్సీ వైద్యుడు డాక్టర్ భరద్వాజ్, టీడీపీ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
