ప్రసాదరాజుకు సీఎంను విమర్శించే స్థాయి లేదు: కొత్తపల్లి
చంద్రబాబు మాటలను వైసీపీ వక్రీకరిస్తోంది.. కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నం
నర్సాపురం,ఆంధ్రప్రభ: వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి, అర్హత లేదని మాజీ మంత్రి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. బుధవారం రాత్రి తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసాదరాజు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
మంత్రి పదవి కోసం జిల్లా కేంద్రాన్ని తాకట్టు పెట్టిన మాజీ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు.. సీఎం చంద్రబాబును విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని కొత్తపల్లి మండిపడ్డారు. మొగల్తూరులో జరిగిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు నాయుడు.. స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌కు నియోజకవర్గ అధికారుల పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారని తెలిపారు.
అయితే ముఖ్యమంత్రి చేసిన సూచనలను వైసీపీ నాయకులు వక్రీకరిస్తూ కూటమి ప్రభుత్వంలో విభేదాలు సృష్టించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.
వైసీపీ హయాంలో పనులకు నిధులు ఇవ్వలేదు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నర్సాపురం నియోజకవర్గంలో సుమారు రూ.3,200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని, అయితే వాటిలో ఏ ఒక్క పనికీ నిధులు కేటాయించలేదని కొత్తపల్లి ఎద్దేవా చేశారు. ఇళ్ల నిర్మాణానికి కూడా పనికిరాని స్థలాలను లబ్ధిదారులకు కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వ పాలనలో నర్సాపురం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గ పర్యటన విజయవంతమైందని పేర్కొంటూ, పర్యటన విజయానికి సహకరించిన కూటమి నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలకు కొత్తపల్లి సుబ్బారాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
