గాంధీజీ ఆశయాల సాధనకు కృషి చేయాలి
- సత్యం, అహింస, ధర్మాన్ని పాటించాలి: ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉదయం 7 గంటలకు జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈగల సునీంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, కమిషనర్ నాగిరెడ్డి, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పుర ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. సత్యం, అహింస, ధర్మాన్ని పాటించాలని సూచించారు. సమాజంలో అంటరానితనం, వివక్ష పూర్తిగా తొలగిపోవాలని ఆకాంక్షించారు. మద్యపానానికి దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. శాంతి కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ అని, ఆయన సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
