కరెంటు కోతలు సర్కార్ వైఫల్యం !
- బొగ్గు నిల్వలు సిద్ధం చేసుకోవడంలో నిర్లక్ష్యం
- అధికారులపై చర్యలతో సమస్య పరిష్కారం కాదు: కోలేటి దామోదర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ఎల్‌నినోను కారణంగా చూపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంపై శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినప్పటికీ, విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, బొగ్గు నిల్వలను సిద్ధం చేసుకోకపోవడం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై నెపం వేస్తోందని దామోదర్ మండిపడ్డారు. విద్యుత్ వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేకపోయిన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులను సస్పెండ్ చేసినంత మాత్రాన రైతుల పొలాలకు విద్యుత్ సరఫరా మెరుగుపడదని వ్యాఖ్యానించారు. కోతలకు అసలు కారణాలేమిటో, విద్యుత్ ఉత్పత్తి ఎందుకు తగ్గిందో ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలని కోరారు.
బొగ్గు నిల్వలపై ప్రశ్నలు..
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సాధారణంగా 20 నుంచి 25 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలనే నిబంధనలు ఉన్నాయని దామోదర్ పేర్కొన్నారు. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ నిల్వల పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు చేస్తుంటుందని తెలిపారు. అయినప్పటికీ, తెలంగాణలోని యాదాద్రి, కేటీపీఎస్, మణుగూరు విద్యుత్ కేంద్రాల్లో వారం రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవని ఆయన ఆరోపించారు. దీనికి ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక, పర్యవేక్షణ లోపమే కారణమని విమర్శించారు.
బొగ్గు గనులు లేని కర్ణాటకలోని రాయచూరు, ఆంధ్రప్రదేశ్‌లోని వీటీపీఎస్, ఆర్టీపీఎస్ వంటి కేంద్రాలు సింగరేణి బొగ్గు సరఫరా ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయని దామోదర్ పేర్కొన్నారు. బొగ్గు గనులకు సమీపంలో ఉన్న మణుగూరు, కేటీపీఎస్ కేంద్రాల్లోనే నిల్వల కొరత ఎందుకు ఏర్పడుతోందని ప్రశ్నించారు. బొగ్గు సరఫరా, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ హయాంలో లేదా? ఇప్పుడెందుకీ కోతలు?
కేసీఆర్ పదేళ్ల పాలనలో ఇదే విద్యుత్ రంగంలో పనిచేసిన అధికారులు రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయలేదా అని దామోదర్ ప్రశ్నించారు. అప్పట్లో పనిచేసిన అధికారులే ఇప్పుడు లక్ష్యంగా మారడం వెనుక కారణమేమిటని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన చర్యలు, నిర్మించిన ప్రాజెక్టులు, వ్యవసాయ విద్యుత్ సరఫరా కోసం చేసిన ఏర్పాట్లను ప్రజలు గుర్తుంచుకున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నుంచి ప్రస్తుత ప్రభుత్వం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని వ్యాఖ్యానించారు.
విద్యుత్ లోటు అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని కాంగ్రెస్ నేతలు చెప్పడం సరికాదని దామోదర్ విమర్శించారు. ఆగస్టులో హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, అస్సాం, మణిపూర్, సిక్కిం, ఒడిశా, మేఘాలయ, త్రిపుర, పశ్చిమబెంగాల్, అరుణాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలు డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేశాయని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాల్లో విద్యుత్ లోటు నమోదు కానప్పుడు తెలంగాణలో కోతలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు.
విద్యుత్ ప్రణాళిక ప్రకటించాలి
విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని, రైతులు పెట్టుబడులు నష్టపోతున్నారని దామోదర్ ఆందోళన వ్యక్తం చేశారు. మోటార్లు దెబ్బతినడం సహా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవడం ద్వారా సమస్య నుంచి తప్పించుకోవచ్చని భావించడం పొరపాటని అన్నారు.
బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయి, విద్యుత్ ఉత్పత్తి ఎందుకు తగ్గింది, సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి అనే ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కోలేటి దామోదర్ డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి తక్షణమే స్పష్టమైన ప్రణాళిక ప్రకటించి, అప్రకటిత కోతల నుంచి తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను కాపాడాలని కోరారు.
