శ్రామిక మహిళా పోరాట దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

ఆలేరు, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాలలో శ్రామిక మహిళల ఉపాధిని దెబ్బతీయడానికి కారణమైన మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన వీ బీ జీ రాం జీ చట్టానికి వ్యతిరేకంగా మార్చి 1నుండి 8 వరకు పీ ఓ డబ్ల్యూ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవాలను గ్రామ గ్రామాన విజయవంతంగా జరపాలని ప్రగతిశీల మహిళా సంఘం(పీ ఓ డబ్ల్యూ) జిల్లా అధ్యక్షురాలు ఆర్.సీత పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంకు సంబంధించిన పోస్టర్ లను సోమవారం ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీత మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం శ్రామిక వర్గ మహిళల ఉపాధి ని దెబ్బతీయడానికి పూనుకున్నదని ఆరోపించారు. పనిభారాన్ని మోపుతూ, వారి శ్రమను దోచుకునేందుకు అదనపు పని గంటలు పెంచుతూ, కార్పొరేట్లకు ఊడిగం చేసే విధానాలను అమలు చేస్తున్నారని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళా పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకముకు పేరు మార్చి, రోజులు పెంచి, బడ్జెట్లో కోతలు విధిస్తూ,రాష్ట్రాలపై ఆర్థిక భారాలను పెంచి క్రమంగా ఆ పథకాన్ని రద్దు చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఇది 26 లక్షల కోట్ల ఉపాధి జాబ్ హోల్డర్లకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు,వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఉపాధి హామీ పథకంలో అత్యధికంగా పని దొరికేది మహిళలకు, దళిత, ఆదివాసి, గిరిజనులకు మాత్రమేనని ఆ పథకం రద్దు చేస్తే ఆ సామాజిక వర్గ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని విమర్శించారు. కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావడం అశేష కార్మిక వర్గం తో పాటు మహిళా కార్మిక వర్గం హక్కులు కోల్పోతారని, అదనపు పని గంటలను భరించాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ సుగుణ,జిల్లా నాయకురాలు, మందనపల్లి ఉప సర్పంచ్ పద్మ శశిరేఖ, గడ్డం పద్మ, తమ్మడి మాధవి,ఇక్కిరి మాధవి,కొమ్మిడి లత పాల్గొన్నారు.
