Breaking News | ఎమ్మెల్యే పై సోషల్ మీడియాలో పోస్ట్.. వీఆర్ఓ పై సస్పెన్షన్ వేటు..

Breaking News | ఎమ్మెల్యే పై సోషల్ మీడియాలో పోస్ట్.. వీఆర్ఓ పై సస్పెన్షన్ వేటు..

నర్సాపురం ఆంధ్ర ప్రభ : సోషల్ మీడియా వేదికగా ప్రజా ప్రతినిధిపై ప్రభుత్వ ఉద్యోగి చేసిన పోస్టుపై అందిన పిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు సదరు ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేశారు. క్రమశిక్షణ చర్యలలో భాగంగానే వీఆర్ ఓ పై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు గురువారం సస్పెండ్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

నర్సాపురం తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారి (వీ ఆర్ ఓ) గా పనిచేస్తున్న కొప్పినీడి వీర వెంకట సత్య నారాయణ (సత్తిబాబు) ఉద్యోగ ధర్మాన్ని పాటించకుండా ఎమ్మెల్యే నాయకర్, ఆయన సోదరుడు సునీల్ పై నిరాదరణ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసైనికులు సదరు వీఆర్ ఓ పై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నెల 4న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, నర్సాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దార్ లను కలిసి వీఆర్ ఓ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నర్సాపురం టౌన్ స్టేషన్ లో కేసు కూడా పెట్టారు. అధికారులకు అందిన పిర్యాదు మేరకు వీఆర్ ఓ కొప్పినీడి వీర వెంకట సత్య నారాయణపై విచారణ చేపట్టి విధులు నుంచి సస్పెండ్ చేశారు. వీఆర్ ఓ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉత్తర్వులు జారీ చేశారు.