అక్రమాస్తుల అధిపతి.. ఏసీబీకి చిక్కిన మేప్మా అధికారి!
- ఏసీబీ వలలో మేప్మా అదనపు డైరెక్టర్
- ఆదాయానికి మించిన ఆస్తులు..
- బినామీల ఇళ్లలోనూ సోదాలు..
- 10 చోట్ల ఏసీబీ సోదాలు..
- బంగారం, వెండి, భవనాలు..
- 1,792 గ్రాముల బంగారం..
- ఉప్పల్‌లో జీ+3 భవనం..
- ఫార్చ్యూనర్ సహా ఐదు వాహనాలు..
- రూ.4.75 కోట్ల ఆస్తుల గుర్తింపు
- మరింత పెరిగే అవకాశం!
హైదరాబాద్, ఆంధ్రప్రభ :
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమం (మేప్మా) అదనపు డైరెక్టర్ యాదగిరి రావు నల్లగుంట్లపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. రంగారెడ్డి రేంజ్ అధికారులు మంగళవారం ఆయన నివాసం, కార్యాలయం, బ్యాంకు లాకర్లు, బంధువులు, సన్నిహితులు, బినామీలకు చెందిన ప్రాంతాలు కలిపి మొత్తం 10 చోట్ల సోదాలు నిర్వహించారు.
భారీగా స్థిరాస్తుల గుర్తింపు..
సోదాల్లో పలు స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నగరం, నల్గొండ జిల్లా సూర్యాపేటలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 12 ఖాళీ స్థలాల విలువను రూ.58.63 లక్షలుగా అంచనా వేశారు. ఉప్పల్‌లో రెండు నివాస ఫ్లాట్ల విలువ రూ.31.36 లక్షలుగా, అదే ప్రాంతంలో జీ+3 అంతస్తులతో పాటు పెంట్‌హౌస్ కలిగిన మరో నివాస భవనం విలువ సుమారు రూ.2 కోట్లుగా గుర్తించారు.
సూర్యాపేట జిల్లాలో ఆర్‌సీసీ పైకప్పుతో ఉన్న ఇంటి విలువ రూ.4.75 లక్షలుగా, ఉప్పల్‌లోని వాణిజ్య దుకాణం విలువ రూ.1.06 లక్షలుగా లెక్కించారు. అయితే ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ అధికారిక అంచనాల కంటే చాలా ఎక్కువగా ఉండవచ్చని ఏసీబీ పేర్కొంది.
బంగారం, వెండి.. వాహనాలు
సోదాల్లో సుమారు 1,792.2 గ్రాముల బంగారు ఆభరణాలు లభించగా, వాటి విలువను రూ.33.82 లక్షలుగా అంచనా వేశారు. మూడు కిలోల వెండి ఆభరణాల విలువ రూ.1.80 లక్షలుగా గుర్తించారు. రెండు నాలుగు చక్రాల వాహనాలు (టయోటా ఫార్చ్యూనర్‌తో పాటు మరో కారు) రూ.73 లక్షలు, మూడు ద్విచక్ర వాహనాలు రూ.2.80 లక్షల విలువైనవిగా పేర్కొన్నారు.
ఇవే కాకుండా రూ.29.08 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ.7,01,171 విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.32.30 లక్షల నిల్వలను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది.
మొత్తం విలువ రూ.4.75 కోట్లు
ప్రాథమికంగా గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ రూ.4,75,61,171గా ఏసీబీ అంచనా వేసింది. మరిన్ని ఆస్తుల వివరాలపై పరిశీలన కొనసాగుతోందని తెలిపింది. అవినీతి నిరోధక చట్టం-1988లోని సవరణల ప్రకారం సెక్షన్ 13(1)(బి), 13(2) కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. నిందిత అధికారిని హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక శాఖ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ తెలిపింది. ఈ కేసు దర్యాప్తులో ఉంది.

