Pope-Leo-xiv : పోప్‌కు అస్వ‌స్థ‌త ! Andhra Prabha Top News

Pope-Leo-xiv : పోప్‌కు అస్వ‌స్థ‌త ! Andhra Prabha Top News

  • ఊపిరితిత్తుల్లో గడ్డ..
  • వచ్చే వారంలోనే ఆపరేషన్
  • ఏడు రోజులు విశ్రాంతి

(రోమ్‌, ఆంధ్ర‌ప్ర‌భ)

కాథలిక్‌ క్రైస్తవుల ఆధ్యాత్మిక గురువు, పోప్‌ లియో XIVకు శస్త్రచికిత్స చేయనున్నారు. వైద్య పరీక్షల్లో ఆయన ఊపిరితిత్తుల్లో చిన్న గడ్డ ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆపరేషన్‌ చేయనున్నట్లు 71 ఏళ్ల పోప్‌ స్వయంగా వెల్లడించారు. అయితే, గడ్డను తొలిదశలోనే గుర్తించామని, అది నిర్దిష్ట ప్రాంతానికే పరిమితమై ఉందని ఆయన తెలిపారు. వైద్యులు శస్త్రచికిత్స చేయడం సముచితమని భావించడంతో తాను అంగీకరించినట్లు వివరించారు.
రోమ్‌లోని సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో ఆదివారం నిర్వహించిన వారపు ప్రార్థన సందర్భంగా పోప్‌ ఈ విషయాన్ని భక్తులతో పంచుకున్నారు. ఊపిరితిత్తుల్లో గుర్తించిన గడ్డపై వైద్యులు పరీక్షలు నిర్వహించారని, ముందస్తుగానే గుర్తించడం వల్ల అవసరమైన చికిత్సకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న భక్తులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

వచ్చే వారంలోనే ఆపరేషన్

పోప్‌ శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను హోలీ సీ ప్రెస్‌ ఆఫీస్‌ ప్రతినిధి మాటియో బ్రూనీ వెల్లడించారు. వచ్చే వారం తొలి రోజుల్లోనే ఆపరేషన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం పోప్‌ కోలుకోవడానికి సుమారు వారం రోజుల సమయం పట్టవచ్చని అంచనా వేశారు. అయితే, ఆపరేషన్‌ స్వభావం, తదుపరి వైద్య విధానాలపై మరిన్ని వివరాలు వెల్లడించలేదు. ఆదివారం ప్రార్థనను ముగించే సమయంలో పోప్‌ తన పట్ల భక్తులు చూపుతున్న ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆధ్యాత్మిక సాన్నిహిత్యం తనకు ఎంతో బలాన్నిస్తోందని పేర్కొన్నారు. భక్తుల ప్రార్థనలకు తనను తాను అప్పగించుకుంటున్నట్లు చెప్పారు.

తొలి అమెరికన్‌ పోప్‌గా చరిత్ర

అసలు పేరు రాబర్ట్‌ ఫ్రాన్సిస్‌ ప్రెవోస్ట్‌. 2025లో పోప్‌ ఫ్రాన్సిస్‌ అనంతరం లియో XIVగా ఆయన బాధ్యతలు చేపట్టారు. సెయింట్‌ పీటర్‌ పీఠాన్ని అధిష్ఠించిన 267వ పోప్‌గా చరిత్రలో నిలిచారు. అమెరికాలో జన్మించిన తొలి పోప్‌ కూడా ఆయనే. 1982లో మత గురువుగా అభిషిక్తులైన లియో XIV.. అనంతరం పెరూలో అనేక సంవత్సరాలు మిషనరీగా పనిచేశారు. అణగారిన వర్గాలతో కలిసి పనిచేస్తూ, వివిధ సమూహాల మధ్య సయోధ్యకు వారధులు నిర్మించే వ్యక్తిగా అక్కడ గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయనకు శస్త్రచికిత్స చేయనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్‌ భక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.