Panyam | పేదవాడి ఇల్లు.. ప్రభుత్వ లక్ష్యం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం (Panyam) ఎమ్మెల్యే గౌరు చరిత (Goura Charitha) పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం చింతలముని కాలనీ 35వ వార్డులో గృహ ప్రవేశాల కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA) మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు మాత్రమే ఇచ్చారని, అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం కేటాయిస్తోందని తెలిపారు. అదేవిధంగా, ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేస్తోందని ఆమె పేర్కొన్నారు. బీసీ, ఎస్సీలకు రూ.50,000 కంటే ఎక్కువ, ఎస్టీలకు రూ.75,000 వరకు, కొన్ని ప్రత్యేక గిరిజన తెగలకు రూ.1 లక్ష వరకు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం టి డ్కోప్రాజెక్టులలో మౌలిక వసతులు పూర్తి చేసి, ప్రజలకు ఇళ్లు అందజేయడానికి కట్టుబడి ఉందన్నారు.

జాయింట్ కలెక్టర్ (Joint Collector) నూరుల్ కమర్ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా గృహనిర్మాణ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. త్వరలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–రూరల్ కింద గృహనిర్మాణాలు ప్రారంభం కానున్నాయని జేసీ తెలిపారు. ఇంకా ఇల్లు లేని అర్హత కలిగిన వారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పీఎం ఏవై పథకానికి తోడ్పాటుగా సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించేందుకు వివిధ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పరచిందని ఉంటుంది తెలిపారు. అలాగే ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని పేర్కొన్నారు. ప్రతి గృహనిర్మాణానికి రూ.2.50 లక్షల నుండి రూ.3.00 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుందని, పొదుపు సంఘాల ద్వారా బ్యాంక్ రుణాలు అందిస్తున్నామని వివరించారు.
అనంతరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (Prime Minister Awas Yojana) కింద ఇల్లు మంజూరైన లావణ్య, కుమ్మరి లక్ష్మి, ఏం. కమలమ్మ, మమతా, బి. సంధ్య తదితరులకు శాంక్షన్ లెటర్ లు అందజేశారు.బి. కృష్ణ వేణి, రేణుక ఇళ్లకు జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే గృహ ప్రవేశాలు చేయించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి చిరంజీవి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, డిఆర్డిఏ పిడి తదితరులు పాల్గొన్నారు.

