మురసు తుఫాను నష్టం అంచనాలు త్వరగా సిద్ధం చేయండి

రెండు, మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలి..
అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
వరద ప్రభావిత ప్రాంతాలపై సమీక్ష..
చికిత్స పొందుతున్న రెస్క్యూ సిబ్బందికి పరామర్శ

సత్తుపల్లి, ఆంధ్రప్రభ: మురసు తుఫాను ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఏర్పడిన నష్టంపై రెండు, మూడు రోజుల్లో అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ప్రత్యేక హెలికాప్టర్‌లో సత్తుపల్లికి చేరుకున్న ఆయన సింగరేణి అతిథి గృహంలో రెండు జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరద విపత్తు సమయంలో ప్రాణనష్టం జరగకుండా అధికారులు సమయస్ఫూర్తితో తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు జిల్లాల్లో విద్యుత్, వ్యవసాయంతో పాటు ఇతర రంగాల్లో జరిగిన నష్టాన్ని యుద్ధ ప్రాతిపదికన అంచనా వేయాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలు, సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మండల కేంద్రంతో పాటు బేతుపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో వరద ప్రభావం కనిపించిందన్నారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.

విద్యుత్, నీటిపారుదల, పంచాయతీరాజ్, వ్యవసాయ, మున్సిపల్ శాఖల వారీగా నష్టం అంచనాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. నివేదికలు అందిన వెంటనే అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. 2024లో మున్నేరు వాగు వరదల సమయంలో ఎదురైన పరిస్థితులను ఈ సందర్భంగా గుర్తుచేశారు. అప్పట్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో లేకపోవడంతో 1,200 మంది పోలీసు, 700 మంది అగ్నిమాపక సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్లు వివరించారు.

సత్తుపల్లి నియోజకవర్గంతో పాటు కొత్తగూడెం డివిజన్‌లో మునుపెన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైందని మంత్రి పేర్కొన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనే సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన చర్యలను సమీక్షించారు. సమర్థంగా విధులు నిర్వహించిన రెండు జిల్లాల కలెక్టర్లను అభినందించారు.

రెస్క్యూ సిబ్బందికి పరామర్శ

సత్తుపల్లి మండలం బేతుపల్లి ప్రాజెక్టులో చిక్కుకుని, అనంతరం సురక్షితంగా బయటపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులను మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పునరావాస కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ఉంటున్న కుటుంబాలను కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, జారే ఆదినారాయణ, రెండు జిల్లాల కలెక్టర్లు దివాకర్ టీఎస్, అంకిత్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అదనపు కలెక్టర్లు పి. శ్రీనివాస్‌రెడ్డి, వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.