వాతావరణం దెబ్బ.. !

  • ఆ ప్రాంతాల్లో పరిషత్‌ పోలింగ్‌ వాయిదా!
  • ⁠ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు చోట్ల ఎన్నికలు రేపటికి మార్పు
  • ⁠కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారుల విజ్ఞప్తుల మేరకు ఎస్‌ఈసీ నిర్ణయం

అమరావతి, ఆంధ్రప్రభ: వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రాష్ట్రంలోని రెండు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నేడు (5వ తేదీ) జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ రేపటికి వాయిదా పడింది. భారీ వర్షాలు, వరదలతో గ్రామాలు, పోలింగ్‌ కేంద్రాలు నీటమునగడం, రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు చేసిన విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు.

ఏలూరు జిల్లాలో ఆరు ప్రాంతాలు

ఏలూరు జిల్లాలో వేలేరుపాడు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాలతోపాటు అచ్యుతాపురంలోని 31, 32వ పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ప్రాంతాల్లో నవంబరు 5న జరగాల్సిన పోలింగ్‌ను 6వ తేదీకి మార్చారు. భారీ వర్షాలు, వరదల కారణంగా పోలింగ్‌ సిబ్బంది, ఎన్నికల సామగ్రి తరలింపు, ఓటర్లు కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని జిల్లా కలెక్టర్‌ నివేదించడంతో ఎస్‌ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

గోపాలపురంలో 64 కేంద్రాలు

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో ఎర్రకాలువ నీటిమట్టం పెరిగి గ్రామాలు, పోలింగ్‌ కేంద్రాలు నీటమునగడం, రహదారుల అనుసంధానం దెబ్బతినడంతో 18 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన 64 పోలింగ్‌ కేంద్రాల్లోనూ పోలింగ్‌ను 6వ తేదీకి వాయిదా వేశారు. అక్కడ కూడా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నివేదికను పరిశీలించిన అనంతరం ఎస్‌ఈసీ ఈ నిర్ణయం ప్రకటించింది.

7న ఓట్ల లెక్కింపు

వాయిదా పడిన ప్రాంతాల్లో నవంబరు 6న పోలింగ్‌, 7న ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఎక్కడైనా రీపోలింగ్‌ అవసరమైతే ఆ ప్రాంతంలో ఓట్ల లెక్కింపును వాయిదా వేసి, కొత్త తేదీని ప్రకటించనుంది. మారిన పోలింగ్‌ తేదీపై ఓటర్లు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు సమాచారం అందించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.