ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలి..

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలని ఉరవకొండ నియోజకవర్గ ఓటర్‌ నమోదు అధికారి రామ్మోహన్‌ సూచించారు. మంగళవారం ఉరవకొండ తహసీల్దార్‌ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రామ్మోహన్‌ మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌-2026 ప్రక్రియను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, నోటీసుల పంపిణీ, అభ్యంతరాల స్వీకరణ, విచారణ ప్రక్రియ క్రమబద్ధంగా కొనసాగుతున్నట్లు వివరించారు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో భాగంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఫారం-6 కింద 1,482, ఫారం-7 కింద 6, ఫారం-8 కింద 964 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. మొత్తం 2,452 క్లెయిమ్‌లు, అభ్యంతరాల దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. బీఎల్‌వోల విచారణ అనంతరం అర్హులైన దరఖాస్తులను ఆమోదించామని, అనర్హులైన వాటిని తిరస్కరించామని తెలిపారు.

ఆమోదించిన క్లెయిమ్‌లను అక్టోబర్‌ 3న ఓటర్ల జాబితాలో ప్రచురిస్తామని రామ్మోహన్‌ తెలిపారు. నో మ్యాపింగ్‌, ఓటర్ల పేర్లలో వ్యత్యాసాలకు సంబంధించి నియోజకవర్గంలో 46,206 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 46,037 మందికి నోటీసులు అందించినట్లు చెప్పారు. మరో 169 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉందన్నారు.

ఇప్పటివరకు 34,442 మంది ఓటర్లను విచారించి, వారి నుంచి సంబంధిత ఆధార పత్రాలు సేకరించి బీఎల్‌వో యాప్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. మరో 11,764 మంది ఓటర్లకు సంబంధించిన ఆధార పత్రాలను నమోదు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో బీఎల్‌వోలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు.

సమావేశంలో ఉరవకొండ తహసీల్దార్‌ అరుణ, విడపనకల్లు తహసీల్దార్‌ వెంకటేశ్వరమ్మ, వజ్రకరూరు తహసీల్దార్‌ జయశ్రీ, బెలుగుప్ప తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌, ఉరవకొండ ఎంపీడీవో రవిప్రసాద్‌, విడపనకల్లు ఎంపీడీవో రాధాకృష్ణ, వజ్రకరూరు డిప్యూటీ ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఉరవకొండ డిప్యూటీ ఎంపీడీవో సతీష్‌కుమార్‌, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ వరప్రసాద్‌, ఎన్నికల సీనియర్‌ అసిస్టెంట్‌ అశ్వత్థతో పాటు టీడీపీ, కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, సీపీఎం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.