నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తుతున్న జిల్లా

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ముదురుతున్న రాజకీయ పోరు
  • విమర్శలు, ప్రతి విమర్శలతో హీట్‌ పెంచుతున్న ప్రధాన పార్టీలు
  • ప్రజా సమస్యలపై వామపక్షాలు.. పార్టీ బలోపేతంపై ఇతర పార్టీల దృష్టి
  • ఎన్నికలకు ముందే బలప్రదర్శనకు సిద్ధమవుతున్న రాజకీయ శ్రేణులు

నాగర్‌కర్నూల్‌, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. కేంద్ర, రాష్ట్ర రాజకీయ పరిణామాలకు తోడు స్థానిక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై ప్రధాన రాజకీయ పార్టీలు వరుస ఆందోళనలకు దిగుతుండటంతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై బీజేపీ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై వామపక్షాలు పోరాటాలకు దిగుతుండగా.. రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వేడి పెరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలు ఇప్పటి నుంచే తమ బలాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా స్పందిస్తూ రాజకీయంగా దూకుడు పెంచుతోంది. కేంద్రంలోని బీజేపీ విధానాలను ఎండగట్టే కార్యక్రమాలకు రాష్ట్ర కాంగ్రెస్‌ పిలుపునివ్వడంతో జిల్లా కేంద్రాల్లోనూ ఆందోళనలు నిర్వహించింది. రాహుల్‌గాంధీపై కేసు నమోదు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై అవమానకరంగా వ్యవహరించారంటూ కాంగ్రెస్‌ ఆరోపించిన అంశాలను నిరసిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా బలోపేతంపై కూడా దృష్టి సారించింది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు పార్టీ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ విమర్శలకు ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూ ప్రభుత్వ పనితీరును వివరించే ప్రయత్నం చేస్తోంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది.

బీఆర్‌ఎస్‌ సైతం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వరుస కార్యక్రమాలు చేపడుతోంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను పెద్దఎత్తున కదిలించింది. ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా బుధవారం అన్ని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందంటూ విమర్శలు గుప్పించారు.

ఈ కార్యక్రమాల కొనసాగింపుగా గురువారం మండల విద్యుత్‌ కార్యాలయాల ఎదుట బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో జిల్లాలో బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్య రాజకీయ పోరు మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాటానికి పదును పెంచుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాల బకాయిల విడుదల తదితర అంశాలపై భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది. జిల్లా కేంద్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించిన బీజేపీ.. మరోవైపు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.

వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం కూడా ప్రజా సమస్యలపై తమ పోరాటాలను కొనసాగిస్తున్నాయి. వసతి గృహాల సమస్యలు, ఆసుపత్రుల్లో ఇబ్బందులు, కార్మికుల సమస్యలు తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కలెక్టరేట్‌ల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ చేపట్టిన ‘మోదీ హటావో.. దేశ్‌ కీ బచావో’ కార్యక్రమంలో భాగంగా పాదయాత్రలు నిర్వహించడంతో పాటు ఢిల్లీలో చేపట్టిన కార్యక్రమాలకు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి.

బహుజన సమాజ్‌ పార్టీ కూడా స్థానిక సమస్యలను ప్రధానంగా చేసుకుని ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతోంది. జనసేన సైతం నియోజకవర్గ స్థాయి సమావేశాలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నాయి.

మొత్తంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రాజకీయ పార్టీల మధ్య పోటీ ఇప్పటి నుంచే కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్‌ తన పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఉద్యమాల బాట పట్టాయి. వామపక్షాలు, ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు తమకు సంబంధించిన అంశాలపై ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. పార్టీల కదలికలు, బహిరంగ సభలు, నిరసనలు, పరస్పర ఆరోపణలతో జిల్లాలో రాజకీయ వేడి మాత్రం ఇప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది.