మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

అప్పు అడిగిన మహిళను హతమార్చిన వ్యక్తి

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సంఘటనపై మంగళవారం నాగర్‌కర్నూల్ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. తెలకపల్లి మండలం రాకొండ గ్రామానికి చెందిన నాగి బంగారమ్మ (43) మూడు రోజుల క్రితం హత్యకు గురైనట్లు తెలిపారు. ఈ కేసులో తాడూరు గ్రామానికి చెందిన ఎన్నుపోతుల భీమయ్య (38)ను నిందితుడిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా బంగారమ్మతో భీమయ్యకు పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైందన్నారు. బంగారమ్మ తన పొలాన్ని విక్రయించిన సమయంలో భీమయ్య కొంత నగదు అప్పుగా తీసుకున్నట్లు తెలిపారు.

అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని బంగారమ్మ కొంతకాలంగా భీమయ్యను అడుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు తిరిగి ఇవ్వకూడదనే ఉద్దేశంతో బంగారమ్మను హత్య చేయాలని భీమయ్య పథకం వేసినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 15న డబ్బుల విషయమై మాట్లాడేందుకు బంగారమ్మను తన పొలం వద్దకు రావాలని భీమయ్య పిలిచినట్లు తెలిపారు. మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లిన బంగారమ్మతో డబ్బుల విషయమై గొడవ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో బొలెరో వాహనంతో బంగారమ్మను ఢీకొట్టి, ఆమెపై నుంచి రెండుసార్లు వాహనం నడిపినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో బంగారమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడు భీమయ్యను ఆగస్టు 18న మధ్యాహ్నం సుమారు 12 గంటలకు అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
నిందితుడి నుంచి టీఎస్‌ 31 టీఏ 4888 నంబర్‌ గల బొలెరో వాహనం, వివో వై39 మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మృతురాలికి చెందిన రెండు బస్‌ టికెట్లు, ఆధార్‌ కార్డు, చేతి సంచిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీతో పాటు నాగర్‌కర్నూల్‌ సీఐ అశోక్‌రెడ్డి, తాడూరు ఎస్సై రాములు, కానిస్టేబుల్‌ రమేష్‌, ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.