కారు కోసం కిరాతకం..
- క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు
- మహారాష్ట్ర గ్యాంగ్ పన్నాగం..
- ప్యాసింజర్లుగా వచ్చి డ్రైవర్‌ను హతమార్చిన దుండగులు
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : బేగంపేటకు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని రుద్రారం వద్ద మృతదేహం లభించిన ఈ కేసులో.. మహారాష్ట్రకు చెందిన నలుగురు సభ్యుల గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. క్యాబ్‌ను దొంగిలించేందుకే రాజశేఖర్‌ను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి గత నేర చరిత్ర, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ కొనసాగిస్తున్నారు.
రాజశేఖర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగులకు రవాణా సేవలు అందించేవారు. సెప్టెంబర్ 10న ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లిన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యులు బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 12న పటాన్‌చెరు పరిధిలోని రుద్రారం వద్ద రాజశేఖర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. క్యాబ్ వివరాలు, సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. విచారణలో భాగంగా.. మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తులు ప్యాసింజర్ల మాదిరిగా క్యాబ్‌ను బుక్ చేసుకున్నట్లు గుర్తించారు.
పటాన్‌చెరు దాటిన తర్వాత డ్రైవర్‌పై దాడి..
నిందితులు పటాన్‌చెరు దాటిన తర్వాత రాజశేఖర్‌ను డ్రైవర్ సీటు నుంచి తప్పించి తాము కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఆయనపై దాడి చేసి, వైర్‌తో గొంతు బిగించి హత్య చేసినట్లు తెలిపారు. హత్య అనంతరం రాజశేఖర్ ముఖంపై కూడా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మృతదేహాన్ని రుద్రారం సమీపంలోని రోడ్డు పక్కన పడేసి క్యాబ్‌తో పరారైనట్లు వెల్లడించారు.
రాజశేఖర్ మృతదేహం లభించిన ప్రాంతానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డి జిల్లా బుధేరా వద్ద ఎన్‌హెచ్-65 సమీపంలో క్యాబ్‌ను పోలీసులు గుర్తించారు. కారులో తనిఖీలు నిర్వహించిన సమయంలో బీర్ బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు లభించినట్లు పోలీసులు తెలిపారు. వీటి ఆధారంగా నిందితుల ప్రయాణ వివరాలను పోలీసులు పరిశీలించారు.
దర్యాప్తులో భాగంగా రాజశేఖర్‌కు పరిచయం ఉన్న పలువురు క్యాబ్ డ్రైవర్లను పోలీసులు విచారించారు. ఆయన కదలికలు, చివరిసారిగా ఎవరితో వెళ్లారు, క్యాబ్ బుకింగ్ వివరాలపై సమాచారం సేకరించారు. ఈ ఆధారాలతో దర్యాప్తు ముందుకు సాగగా.. క్యాబ్ చోరీ కోసమే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం నిందితులపై మరింత విచారణ కొనసాగుతోంది. వీరు గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా? మరేదైనా కేసుల్లో సంబంధం ఉందా? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.
పోస్టుమార్టంలో వెలుగులోకి కారణం
రాజశేఖర్ సోదరుడు రాంబాబు ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన పోస్టుమార్టంలో మెడకు బెల్ట్ లేదా వైర్ వంటి వస్తువుతో బిగించి హత్య చేసినట్లు వైద్యులు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజీలు, క్యాబ్ బుకింగ్ వివరాలు, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నారు.
