Kadapa | మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ జాకీర్‌కు గాయాలు…
Kadapa | మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ జాకీర్‌కు గాయాలు…
- పోలీసులపై కత్తితో దాడికి యత్నం..
- ఆత్మరక్షణ కొరకు కాల్పులు
- ఇద్దరు అరెస్టు.. నలుగురు పరారీ
- 161 కిలోల ఎర్రచందనం, ఈచర్, కారు స్వాధీనం
Kadapa | దువ్వూరు, సెప్టెంబర్ 24 (ఆంధ్రప్రభ): కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు సమీపంలో ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆత్మరక్షణలో జరిపిన కాల్పుల్లో చాపాడు మండలం ఖాదర్‌పల్లెకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ షేక్ చింపర్తి జాకీర్ ఎడమ కాలికి బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. ఈ ఘటనలో పోలీసులపై కత్తితో దాడికి యత్నించిన జాకీర్‌తో పాటు మరో నిందితుడు మంగపట్నం సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం…
దువ్వూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 131/2026 కేసుకు సంబంధించి.. చాపాడు ఎస్‌ఐ కె. చిన్నపెద్దయ్యకు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో అందిన విశ్వసనీయ సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చాపాడు, దువ్వూరు పోలీసు సిబ్బంది సంయుక్తంగా దువ్వూరు జగనన్న కాలనీ సమీపంలో తనిఖీలు చేపట్టారు.ఈ సమయంలో ఐచర్ వాహనం, కారుతో ఉన్న కొంతమంది వ్యక్తులు పోలీసులను చూసి కర్రలు, రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో జాకీర్‌ను పోలీసులు గుర్తించినట్లు పేర్కొన్నారు.
జాకీర్ కత్తితో పోలీసు కానిస్టేబుల్ పీసీ-1789 ఇ. చెన్నయ్యపై దాడి చేయడంతో ఆయన ఎడమ చేతికి గాయమైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులపై మళ్లీ కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పలుమార్లు హెచ్చరించినప్పటికీ వినిపించుకోలేదని పేర్కొన్నారు. దీంతో ఆత్మరక్షణ నిమిత్తం తొలుత రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిపారు. అయినప్పటికీ జాకీర్ దాడికి ప్రయత్నించడంతో మరో రౌండ్ కాల్పులు జరపగా బుల్లెట్ అతడి ఎడమ కాలికి తగిలి గాయమైనట్లు పోలీసులు వివరించారు.
ఆసుపత్రికి తరలింపు…
గాయపడిన జాకీర్‌తో పాటు పోలీసుల దాడిలో గాయపడిన కానిస్టేబుల్ చెన్నయ్యను చికిత్స నిమిత్తం మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాకీర్‌కు మెరుగైన వైద్యం కోసం అనంతరం కడప రిమ్స్‌కు తరలించినట్లు సమాచారం.
161 కిలోల ఎర్రచందనం స్వాధీనం..
జాకీర్‌తో కలిసి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు విచారణలో సుధాకర్ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అతని వెల్లడింపు మేరకు ఐచర్ వాహనంలో ఉన్న ఏడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం బరువు 161 కిలోలు కాగా, సుమారు రూ.3.50 లక్షల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. వీటితో పాటు ఏపీ 02 ఏడబ్ల్యూ 7934 నంబరు గల స్విఫ్ట్ డిజైర్ కారు, తమిళనాడు 02 బి వై 6458 నంబరు గల ఈచర్ వాహనం, రాళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు అరెస్టు.. నలుగురు పరారీ..
ఈ కేసులో గాయపడిన నిందితుడు షేక్ చింపర్తి జాకీర్‌తో పాటు మంగపట్నం సుధాకర్ (26)ను పోలీసులు అరెస్టు చేశారు. సుధాకర్‌ను సెప్టెంబరు 24 తెల్లవారుజామున 4 గంటలకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.పరారీలో ఉన్న నిందితులుగా ఖాదర్‌పల్లెకు చెందిన మాపీర్, చార్లీ, బాలప్ప, జాకీర్ అత్తగా పేర్కొంటున్న షేక్ రూన్ పేర్లను పోలీసులు వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
జాకీర్‌పై గతంలోనూ నిఘా..
జాకీర్ ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో పోలీసులకు కావాల్సిన వ్యక్తిగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల జడ్చర్లలో అతడిని అదుపులోకి తీసుకునేందుకు కడప జిల్లా పోలీసులు ప్రయత్నించగా తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తాజాగా దువ్వూరు జగనన్న కాలనీ సమీపంలో అతడిని పట్టుకునే క్రమంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.ఈ కేసులో BNSతో పాటు ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం, ఎర్రచందనం రవాణా నిబంధనలు, PDPP చట్టం, వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
