కేసీఆర్‌ ఇంటిపైకి కాంగ్రెస్‌ కార్యకర్తలకు పోలీస్‌ ఎస్కార్ట్ : కేటీఆర్‌

  • గొంతు నొక్కితే మరింత గట్టిగా మాట్లాడతాం..
  • స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలు..
  • మహిళా నేతలపై దాడి.. రేవంత్‌ ప్రభుత్వం తలదించుకోవాలి
  • హామీల అమలుపై నిలదీస్తాం.. కాంగ్రెస్‌ను వదిలిపెట్టం..
  • ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే కుట్ర..
  • కేసీఆర్‌ను తిట్టడానికి ఒక రోజు పెట్టుకో..
  • మిగతా రోజులు ప్రజల కోసం మాట్లాడదాం: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేసీఆర్‌ను విమర్శించడానికి ఒక రోజు కేటాయించుకోవాలని, మిగతా రోజుల్లో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సూచించారు. ఎర్రవల్లిలో కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించిన ఆయన.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణకు క్రిమినల్‌ మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి రావడం ప్రజల దురదృష్టమని కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై అత్యంత హేయంగా ప్రవర్తించారని ఆరోపించారు. మహిళా నాయకురాళ్లను చుట్టుముట్టి లాగడం, గొంతు పట్టుకోవడం, చీర లాగడం వంటి చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. తమ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారని చెప్పారు. స్పీకర్‌ బాధపడి ఉంటే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని విచారం కూడా వ్యక్తం చేశారని గుర్తుచేశారు. అయినప్పటికీ ఎమ్మెల్సీలను సస్పెండ్‌ చేసి, బహిష్కరించడం ద్వారా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకోవద్దని కేటీఆర్‌ అన్నారు. ‘‘కేసీఆర్‌ను తిట్టడానికి ఒక రోజు పెట్టుకో.. మిగతా రోజులు ప్రజల కోసం మాట్లాడదాం’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధన కోసం 14 ఏళ్లపాటు ఉద్యమం చేసిన కేసీఆర్‌ మరణాన్ని కోరుతూ కాంగ్రెస్‌ సభ్యుడు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ‘‘తెలంగాణ సాధించినందుకు కేసీఆర్‌ చనిపోవాలా?’’ అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ ఇంటిపైకి కాంగ్రెస్‌ శ్రేణులు వెళ్లేలా ప్రభుత్వం పోలీసు ఎస్కార్ట్‌ ఇచ్చిందని కేటీఆర్‌ ఆరోపించారు. రైతుబంధు ద్వారా 70 లక్షల మంది రైతులకు కేసీఆర్‌ అండగా నిలిచారని చెప్పారు. కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్ల వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు భరోసా కల్పించామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడామని అన్నారు.

బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లోనే కాంగ్రెస్‌ కార్యకర్తలతో తమపై దాడి చేయించే ప్రయత్నం జరిగిందని కేటీఆర్ అన్నారు. పోలీస్‌ యంత్రాంగం ఆదేశాలను గౌరవిస్తూ ఉన్న తమపై పోలీస్‌ స్టేషన్‌లోనే దౌర్జన్యానికి ప్రయత్నించడం దారుణమన్నారు. ప్రభుత్వానికి రాజ్యాంగం, చట్టాలు, న్యాయవ్యవస్థపై గౌరవం లేదని విమర్శించారు.

ఇద్దరు ఎమ్మెల్సీలపై ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసులు పెట్టి అరెస్టు చేయడంపై కేటీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. తమను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

తమ అసలు టార్గెట్‌ కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలేనని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలు హామీల అమలు కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా కేటీఆర్‌ అభివర్ణించారు. 420 హామీలు ఇచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. మహిళలకు రూ.2,500, తులం బంగారం, రైతులకు రూ.15 వేల రైతుభరోసా, రైతు కూలీలు, కౌలు రైతులు, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల పరిస్థితి ఏమైందని నిలదీశారు.

రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.4 వేల హామీలు ఏమయ్యాయని తెలంగాణ యువత ప్రశ్నిస్తోందని కేటీఆర్‌ అన్నారు. మహిళలకు ఇస్తామన్న స్కూటీల హామీని కూడా ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేదలు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడు డీఏలు పెండింగ్‌లో పెట్టారని కేటీఆర్‌ విమర్శించారు. ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చి మూడేళ్లు దాటినా అమలు చేయలేదన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులు, పెన్షనర్లకు సరైన ప్రయోజనాలు అందడం లేదని ఆరోపించారు.

కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్‌ ఆరోపించారు. జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ వ్యవహారాల్లో తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టు రైతులకు వెంటనే నీటి విడుదల షెడ్యూల్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ హయాంలో 510 అడుగుల నీటిమట్టం ఉన్న సమయంలోనూ సాగర్‌ నుంచి ఆయకట్టు రైతులకు నీరు అందించామని కేటీఆర్‌ గుర్తుచేశారు. ప్రస్తుతం 530 అడుగుల నీటిమట్టం ఉన్నప్పటికీ సాగర్‌ ఆయకట్టుకు నీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కన్నెపల్లి పంపులు ఎప్పుడు ఆన్‌ చేస్తారో, కాళేశ్వరం నీళ్లు ఎప్పుడు వస్తాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరంపై రాజకీయాలు పక్కనపెట్టి రైతుల ప్రయోజనాల కోసం ప్రాజెక్టును వినియోగించాలని కోరారు.

కోటి ఎకరాలకు సంబంధించిన నిషేధిత జాబితా భూములు, విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై అసెంబ్లీలో చర్చించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా తమను అడ్డుకునేందుకు పోలీసులను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.