క‌ల్తీ మ‌ద్యం కేసులో పోలీసుల దూకుడు

క‌ల్తీ మ‌ద్యం కేసులో పోలీసుల దూకుడు

జోగి సోదరుడు రాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాము కూడా..

  • అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ జోగి ఇంటి వద్ద వైసీపీ శ్రేణుల నిరసన
  • ప్రభుత్వం, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు

ఇబ్రహీంపట్నం, నవంబర్ 2 (ఆంధ్రప్రభ): రాష్ట్రంలో సంచలనం కలిగించిన కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను పోలీసులు ఆదివారం ఉద‌యం అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగి రమేష్ నివాసానికి సిట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఆదివారం ఉదయం 5:30 గంటలకు చేరుకున్నారు. జోగితో పాటు ఆయన సోదరుడు జోగి రాము ఇంటి వద్దకు కూడా పోలీసులు చేరుకున్నారు. మూడున్నర గంటల హైడ్రామా అనంతరం మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రామును అరెస్టు చేశారు. అయితే జోగి ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును ఉదయాన్నే పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు. అతన్ని ఎక్కడికి తీసుకెళ్లారో స్పష్టత లేదు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు జోగి ఇంటి వద్దకు చేరుకుని బైఠాయించారు. తమ నాయకుడిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ నిరసన తెలిపారు.

కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్, చంద్రబాబు డౌన్ డౌన్, నారా వారి సారా రాజ్యం నశించాలని నినాదాలు చేశారు. కాగా జోగి ఇంటిలోని మూడు అంతస్థుల్లో కి వెళ్లిన పోలీసులు ఆయన ఏ అంతస్థులో ఉన్నారో విచారించారు. మొదటి అంతస్థులో ఉన్న విషయం తెలుసుకుని సెల్లార్ లోనే మూడున్నర గంటలు వేచి చూశారు. అనంతరం సెర్చ్ వారెంట్ ఇచ్చి అరెస్టు చేశారు. అరెస్టు తరువాత భార్య, కుటుంబ సభ్యులతో బయటకు వచ్చి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. భార్య శకుంతల కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆమెకు ధైర్యం చెప్పి పంపారు. అనంతరం పోలీసు వాహనంలోకి ఎక్కిన జోగి వైసీపీ శ్రేణులకు అభివాదం చేశారు. ఆ సమయంలో జై జోగి అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. అరెస్టు చేసిన జోగిని పోలీసులు గురునాన‌క్ కాల‌నీ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Leave a Reply