ద్విచక్ర వాహనాల చోరీ కేసును ఛేదించిన పోలవరం పోలీసులు

నిందితుడి అరెస్ట్‌.. ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

పోలవరం, ఆంధ్రప్రభ: ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఓ యువకుడిని పోలవరం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్‌ శివకిషోర్‌ ఐపీఎస్‌ ఆదేశాల మేరకు, పోలవరం డీఎస్పీ కె. జయకృష్ణ సూచనలతో సీఐ బి. కృష్ణకుమార్‌ పర్యవేక్షణలో ఎస్సై పి. అప్పారావు సిబ్బందితో కలిసి వాహనాల చోరీల నియంత్రణ, నేరాల ఛేదనపై ప్రత్యేక దృష్టి సారించారు.

సీసీ కెమెరాలతో కదలికల గుర్తింపు

ప్రభుత్వం ఏర్పాటు చేసిన 360 డిగ్రీల సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ద్వారా చోరీకి గురైన ఓ ద్విచక్ర వాహనం కదలికలను పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన సమాచారం ఏలూరు కంట్రోల్‌ రూమ్‌ నుంచి పోలవరం పోలీసులకు అందడంతో వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో సెప్టెంబరు 1న రేపల్లెవాడ జంక్షన్‌ వద్ద అనుమానాస్పదంగా యూటర్న్‌ తీసుకుని తప్పించుకునేందుకు ప్రయత్నించిన కమ్మరగూడెం గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాస్‌ అలియాస్‌ చింటు (19)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడినట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

మూడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోరీలు

నిందితుడు ఇచ్చిన సమాచారంతో చేపట్టిన రికవరీలో మొత్తం ఆరు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పోలవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోరీకి గురైన మూడు, సీతానగరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోరీకి గురైన రెండు, రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోరీకి గురైన ఒక వాహనం ఉన్నాయి.

దాసరి శ్రీనివాస్‌ (చింటు)ను పోలవరం పోలీస్‌స్టేషన్‌ క్రైమ్‌ నంబర్‌ 65/2026, బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 331(4), 305(ఎ) కింద అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

అనుమానాస్పద వాహనాల కొనుగోలుపై హెచ్చరిక

సరైన యాజమాన్య పత్రాలు, రిజిస్ట్రేషన్‌ వివరాలు, ఇతర ధ్రువపత్రాలను పరిశీలించకుండా అపరిచిత వ్యక్తుల వద్ద ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయవద్దని డీఎస్పీ కె. జయకృష్ణ ప్రజలకు సూచించారు. తక్కువ ధరకు వస్తుందనే ఉద్దేశంతో పత్రాలు లేని లేదా అనుమానాస్పద వ్యక్తుల నుంచి వాహనాలు కొనుగోలు చేయడం వల్ల చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

చోరీకి గురైన వాహనం అని తెలిసి కూడా కొనుగోలు చేయడం, స్వీకరించడం లేదా తమ ఆధీనంలో ఉంచుకోవడం చట్టపరంగా నేరమని తెలిపారు. వాహనం కొనుగోలు చేసే ముందు రిజిస్ట్రేషన్‌, యాజమాన్య వివరాలు, చట్టబద్ధమైన పత్రాలను పూర్తిగా పరిశీలించాలని సూచించారు.