పీఓ డైరీ నిర్వహణ అత్యంత కీలకం

పీఓల హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా చదవాలి

ఎన్నికల విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.. కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌

అడ్డతీగల, ఆంధ్రప్రభ : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్‌ అధికారులు (పీఓలు), అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు (ఏపీఓలు) తమ విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పోలవరం (రంపచోడవరం) జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె. దినేష్‌ కుమార్‌ సూచించారు. సోమవారం అడ్డతీగల మండలంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులతో సమీక్షా సమావేశం, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రిసైడింగ్‌ అధికారి హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా చదివి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సందేహాలను ముందుగానే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. పోలింగ్‌ ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన ఏర్పాట్లు, ఓటర్ల గుర్తింపు, పోలింగ్‌ నిర్వహణ, ఎన్నికల సామగ్రి వినియోగం, పోలింగ్‌ ముగిసిన అనంతరం చేపట్టాల్సిన విధులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రంలో జరిగే ముఖ్యమైన సంఘటనలు, పోలింగ్‌ సమయాలు, ఎదురైన సమస్యలు, వాటిపై తీసుకున్న చర్యలను ప్రిసైడింగ్‌ అధికారి డైరీలో ఎప్పటికప్పుడు క్రమబద్ధంగా నమోదు చేయాలని సూచించారు. పీఓ డైరీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన అధికారిక రికార్డు కావడంతో దాని నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. పీఓలు, ఏపీఓలు సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహనతో తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్‌ అధికారి డీఎన్‌వీ రమణ, తహసీల్దార్‌ తేజస్విని, ఎంపీడీవో కుమార్‌, పీఓలు, ఏపీఓలు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.