పోచవరం గ్రామాన్ని ముంపు జాబితాలో చేర్చాలి

పోచవరం గ్రామాన్ని ముంపు జాబితాలో చేర్చాలి
- చింతూరు ఐటీడీఏ ఎదుట అందోళన చేసిన గ్రామస్తులు
చింతూరు పోలవరం జిల్లా, ఆంధ్రప్రభ : చింతూరు ఐటీడీఏ పరిధిలోని కూనవరం మండలం పోచవరం గ్రామాన్ని పోలవరం ముంపు లో చేర్చి పరిహారం, పునరావాస ప్యాకేజీ ఇప్పించాలని కోరుతూ ఆ గ్రామస్తులు బుధవారం చింతూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట అందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వరదలు వస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వరదల సమయంలో పోచవరం గ్రామాన్ని వరద చుట్టు-ముట్టి బయటకు వెళ్లడానికి కనీసం రోడ్డు మార్గం లేకుండా ఉంటు-ందన్నారు.
ఆరోగ్య ఇబ్బందులు వస్తే కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, గత వరదల సమయంలో ఆరోగ్య సమస్యతో వైద్యం అందక ఒక మనిషి మరణించాడని గుర్తు చేశారు. వరదల సమయంలో తినడానికి కనీసం తిండి లేక ఉపవాసం ఉన్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న చింతూరు ఐటీడీఏ పీవో ధర్నా చేస్తున్న గ్రామస్తుల వద్దకు వచ్చి వారి సమస్యలను విని, ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

వరదల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. గ్రామస్తులు పలు సమస్యలపై ఐటీడీఏ పీవోకి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోచవరం కాలనీవాసులు సూదిపాక శ్రీనివాస్ రావు, సూదిపాక వెంకటమ్మ, కొయ్యల బూబమ్మ, చండ్రుగొండ వరలక్ష్మి, పిడియాల జయ, దాది పద్మ, జమీలి బాలరాజు, బూరుగు సుశీల, చండ్రుగొండ కుమారి, కొయ్యల వరలక్ష్మి, ఎస్.కె మునిరా, కొయ్యల రమణ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు
