జుక్కల్లో ఘనంగా పొలాల అమావాస్య పండుగ…
- బసవన్నలకు ప్రత్యేక పూజలు..
- అందంగా అలంకరించిన ఎడ్లు
- భక్తిశ్రద్ధలతో రైతుల సంప్రదాయ వేడుకలు
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ : శ్రావణమాసం చివరి రోజైన గురువారం అమావాస్యను పురస్కరించుకుని జుక్కల్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో పొలాల అమావాస్య పండుగను రైతులు, ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఎడ్లను బసవన్నలుగా భావించి ప్రత్యేక పూజలు చేశారు. మండలంలో పలువురు ప్రజాప్రతినిధులు రైతులు కావడంతో పండుగ వేడుకలు మరింత సందడిగా సాగాయి. పండుగ సందర్భంగా రైతులు ఎడ్లను పనులకు పంపకుండా ఇంటి వద్దే ఉంచి నీటితో శుభ్రంగా కడిగారు. అనంతరం రంగురంగుల అలంకరణలతో ముస్తాబు చేసి, వీపుపై అందమైన వస్త్రాలు కప్పి, మెడలో గంటలు, తలపై బాసింగాలు కట్టారు.
రైతు కుటుంబాలు నైవేద్యాలు సిద్ధం చేసుకుని పంట పొలాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఎడ్లకు పౌష్టికాహారం అందించి భాజాభజంత్రీలతో ఊరేగింపుగా ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్లారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం ఎడ్లను ఇంటికి తీసుకొచ్చి హారతులు ఇచ్చి సంప్రదాయబద్ధంగా ఎడ్ల పెళ్లిళ్లు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు కూడా వేడుకల్లో పాల్గొని అందంగా అలంకరించిన ఎడ్లకు బహుమతులు అందజేశారు. పండుగ సందర్భంగా ప్రతి ఇల్లు బంధుమిత్రులతో సందడిగా మారింది. పాడిపశువులు ఆరోగ్యంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంట దిగుబడులు పెరగాలని, గ్రామాల్లో సుఖశాంతులు నెలకొనాలని రైతులు ప్రత్యేకంగా ప్రార్థించారు. ఇంటింటా తీపి పోలెలు, ఇతర సంప్రదాయ వంటకాలు తయారు చేసి బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేశారు. పశువుల సంఖ్య, సంతానోత్పత్తి తగ్గుతున్నప్పటికీ పొలాల అమావాస్య పండుగకు ఆదరణ మాత్రం తగ్గలేదు. ఎడ్ల ఊరేగింపును తిలకించేందుకు మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని ఆంజనేయస్వామి ఆలయాల వద్ద వందలాది మంది రైతులు, గ్రామస్తులు తరలివచ్చారు.
