ఘనంగా పొలాల అమావాస్య..
బసవన్నల పండుగ
బసవన్నలను అలంకరించి ప్రత్యేక పూజలు..
వ్యవసాయ పనిముట్లకు పూజలు
లింగాపూర్, ఆంధ్రప్రభ : లింగాపూర్ మండలంలోని అన్ని తండాలు, గూడాల్లో గురువారం పొలాల అమావాస్య, బసవన్నల పండుగను రైతులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఎడ్లను శుభ్రంగా కడిగి, కొమ్ములకు రంగులు వేసి, మెడలో గజ్జలు, జూలాలు, కొత్త గొంగళ్లతో అందంగా అలంకరించారు. అనంతరం బసవన్నలను హనుమంతుని ఆలయాల వద్దకు తీసుకెళ్లి హరహర మహాదేవ అంటూ నినదిస్తూ ఆలయం చుట్టూ తిప్పారు. నైవేద్యాలు సమర్పించి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రైతులు ఏడాది పొడవునా తమ వ్యవసాయ పనుల్లో తోడుగా ఉండే ఎడ్లను స్మరించుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే నాగలి, పార, గొడ్డలి, కొడవలి తదితర వ్యవసాయ పనిముట్లను శుభ్రపరిచి పసుపు, కుంకుమలతో ప్రత్యేకంగా పూజించారు. కార్యక్రమంలో ఖాన్య, తులసీరామ్, మా రాజ్, గ్రామ నాయక్ రామ్‌చంద్, సజన్, గులాబ్‌సింగ్, మంగ్య, జేమ్ల, పరశురాం, బిక్కు, దేవా, గన్నీ, ఉత్తం, భావ్‌సింగ్, మచ్చేందర్‌తో పాటు యువకులు, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
