పీఎం సూర్యఘర్‌పై అవగాహన కల్పించాలి
సేవా సేతు అభియాన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం, ఆంధ్రప్రభ : పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి కుటుంబం సౌర విద్యుత్‌ను వినియోగించుకుని విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని డి-4 సబ్‌డివిజన్ సింగ్‌నగర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన సేవా సేతు అభియాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సౌర విద్యుత్ వినియోగంతో విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు, విద్యుత్ సిబ్బంది అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.
సేవా సేతు అభియాన్ ద్వారా విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం అభినందనీయమని బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజలకు విద్యుత్ సేవలు మరింత చేరువయ్యేలా అధికారులు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ ప్రాజెక్టు డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్. మూర్తి, డీఈ హనుమయ్య, రవికిశోర్, ఏఈ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
