PM | సౌదీ నుంచి హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్న ప్రధాని – మరి కొద్దిసేపట్లో శ్రీనగర్ కు పయనం

న్యూ ఢిల్లీ – అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామ్‌లో ఉగ్ర వాదుల దాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనను కుదించుకున్నారు. హుటాహుటిన భారత్‌కు బయలుదేరారు.

ఈ దాడి నేపథ్యంలో తన పర్యటనను కుదించుకుని సౌదీ అరేబియా నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ కొద్దిసేపటి కిందటే ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. జెడ్డా నుంచి ఎయిరిండియా వన్‌లో బయలుదేరిన ఆయన ఈ తెల్లవారు జామునన 6:30 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకున్నారు.ఇంకాస్సేపట్లో ఆయన శ్రీనగర్‌కు బయలుదేరి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించనున్నారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రస్తుతం శ్రీనగర్‌లోనే ఉన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహదారు అజిత్ ధోవల్, ఆర్మీ చీఫ్‌ ఈ సమీక్షలో పాల్గొననున్నారు.ఉగ్రవాద దాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో నెలకొన్న శాంతిభద్రతలపై సమగ్రంగా సమీక్షించనున్నారు. అక్కడి నుంచి పహల్గామ్ కూడా వెళ్తారని తెలుస్తోంది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారని సమాచారం.

28 మంది దుర్మరణం

.అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామ్‌లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన సంభవించింది. వేసవి సీజన్ కావడం వల్ల జమ్మూ కాశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. ఎడ తెరిపి లేకుండా అక్కడ మంచు కురుస్తోంది. మంచుకొండల అందాలను తిలకించడానికి వచ్చే సందర్శకులతో అక్కడి పర్యాటక ప్రాంతాలన్నీ కూడా పోటెత్తుతున్నాయి. హిల్ స్టేషన్‌ పహల్‌గామ్‌లో రద్దీ మరింత అధికంగా ఉంటోంది.ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కాల్పులకు తెగబడ్డారు. ఈ మధ్యాహ్నం పహల్‌గావ్‌లో రెండు పర్యాటక బృందాలపై ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది కన్నుమూశారు. మరో 20 మంది మృత్యువు తో పోరాడుతున్నారు.

పహల్‌గామ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందిన వెంటనే భద్రత బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

Leave a Reply