బురదలో నాట్లు వేస్తే రోడ్డు బాగుపడదు..
ఎల్కతుర్తి రహదారి సమస్యపై బీజేపీది రాజకీయ డ్రామా..
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ఎల్కతుర్తి మండలంలోని రహదారి సమస్యను అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకులు చేస్తున్న బురద నాట్ల నిరసన ప్రజా సమస్య పరిష్కారం కోసం కాదని, కేవలం రాజకీయ ప్రచారం కోసమేనని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ విమర్శించారు. మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బురదలో నాట్లు వేస్తే రోడ్డు బాగుపడదని, ఫొటోలు దిగితే ప్రజల కష్టాలు తీరవని అన్నారు. రహదారి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వాటిని పక్కనపెట్టి బీజేపీ నాయకులు రాజకీయ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.
నేషనల్ హైవే పరిధిలో ఉన్న రహదారి సమస్యకు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రహదారి జాతీయ రహదారుల పరిధిలో ఉన్నప్పుడు సంబంధిత అధికారులు, కేంద్ర ప్రభుత్వం, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇప్పటివరకు ఏం చేశారో బీజేపీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని, కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కొనసాగుతున్నారని గుర్తు చేశారు. ఎల్కతుర్తి రహదారి సమస్యపై ఎంపీ ఎన్ని సార్లు కేంద్ర అధికారులతో మాట్లాడారు, ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఏ చర్యలు చేపట్టారో ప్రజల ముందు ఉంచాలని అన్నారు.
తమ పరిధిలోని బాధ్యతలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. ముందుగా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవే అధికారులు, తమ ఎంపీని ప్రశ్నించి రహదారి పనులు జరిగేలా చూడాలని సూచించారు. అభివృద్ధిపై మంత్రి ప్రత్యేక దృష్టి ఎల్కతుర్తి మండల అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి సారించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ముప్పు శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మార్వో కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసి, టెండర్లు పూర్తి చేసి, నిధులు మంజూరు చేయించి ఏడాది లోపు భవనాన్ని ప్రారంభానికి సిద్ధం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
అదేవిధంగా ఎల్కతుర్తి సర్కిల్ జంక్షన్‌ను సుందరీకరించడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎల్కతుర్తిలో కేజీబీవీ పాఠశాలకు శంకుస్థాపన చేసి పనులు పూర్తి చేయించి, విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురావడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. మంత్రి చొరవతో రహదారి సమస్య పరిష్కారానికి చర్యలు ప్రస్తుత జాతీయ రహదారి సమస్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ను సమన్వయం చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారని ముప్పు శ్రీనివాస్ తెలిపారు.
ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న సమయంలో బీజేపీ నాయకులు బురదలో నాట్లు వేసి ఫొటోలు దిగడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. బురదలోకి దిగి నాట్లు వేయడం సులభమేనని, కానీ ప్రజల సమస్య పరిష్కారం కోసం అధికారులను కలిసి నిధులు తీసుకురావడం, పనులు మంజూరు చేయించడం, టెండర్లు పూర్తి చేయించడం, పనులు పూర్తయ్యే వరకు పర్యవేక్షించడమే అసలైన ప్రజా నాయకత్వమని అన్నారు. ఫొటోలు, ప్రచారాలతో ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేయలేరని పేర్కొన్నారు. ప్రజలకు కావాల్సింది బురదలో నాట్ల ఫొటోలు కాదని, మంచి రోడ్డు, సురక్షిత ప్రయాణం, శాశ్వత పరిష్కారమని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులకు నిజంగా ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఎంపీ బండి సంజయ్ పనుల లెక్క చెప్పాలని, కేంద్ర ప్రభుత్వ బాధ్యతను ప్రశ్నించాలని, జాతీయ రహదారుల అధికారులను నిలదీయాలని ముప్పు శ్రీనివాస్ అన్నారు.
