భక్తుల అంతరంగాల్లో యోగజ్యోతి వెలిగించడమే పిండి దీపారాధన లక్ష్యం
వైభవంగా పిండి దీపోత్సవ శోభాయాత్ర : టీటీడీ జేఈవో ప్రభల గోపీనాథ్
తిరుపతి సిటీ, ఆంధ్రప్రభ : పవిత్ర పెరటాసి మాసం మూడో శనివారం సందర్భంగా భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించి, వారి అంతరంగాల్లో భక్తి, జ్ఞాన జ్యోతులను వెలిగించడమే పిండి దీపోత్సవ లక్ష్యమని టీటీడీ జేఈవో (విద్యా, ఆరోగ్యం) ప్రభల గోపీనాథ్ తెలిపారు. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీబీసీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానం నుంచి అలిపిరి పాదాల మండపం వరకు పిండి దీపోత్సవ శోభాయాత్ర మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల నడుమ భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగింది. మనసును పిండిగా, జ్ఞానాన్ని జ్యోతిగా భావించి ఆరాధించాలని జేఈవో సూచించారు. పిండి దీపారాధనతో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయనే విశ్వాసం భక్తుల్లో ఉందన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ భక్తులు తమ మనసును పిండిగా, జ్ఞానాన్ని జ్యోతిగా భావించి భగవంతుడిని ఆరాధించాలని సూచించారు. కురవ నంబి, తొండమాన్ చక్రవర్తి పిండి దీపంతో శ్రీవారిని ఆరాధించిన విశేషాలను వివరించారు. శోభాయాత్రకు ముందు టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో అర్చకులు పిండి దీపానికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దీపాన్ని అలిపిరి పాదాల మండపానికి తీసుకెళ్లి ప్రతిష్ఠించి పూజలు చేశారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జి. భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు, సీఈ మనోహరం, ఎస్ఈ వేంకటేశ్వర్లు, విజీఓ గిరిధర్, సిఎంవో డాక్టర్ కుసుమ కుమారి, శ్వేత ఇన్చార్జి సంచాలకులు డాక్టర్ వేమ వెంకటరత్నం, ఇతర అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
