పందులను మండల కేంద్రానికి దూరంగా ఉంచాలి

నాంపల్లి, ఆంధ్రప్రభ: గ్రామ పంచాయతీ పరిధిలో పందుల పెంపకం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పందులను నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలని గ్రామ పంచాయతీ ఆదేశాలు జారీ చేసింది. పందుల కారణంగా గ్రామంలో అపరిశుభ్రత, దుర్వాసనతో పాటు ప్రజారోగ్యానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. పందులను పెంచుతున్న యజమానులు గ్రామానికి, నివాస ప్రాంతాలకు దూరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగని ప్రదేశాల్లో వాటిని ఉంచాలని సూచించారు. అదేవిధంగా పందులను గ్రామంలోని వీధులు, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా తిరగనివ్వకుండా యజమానులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీను తెలిపారు. పందుల యజమానులు పంచాయతీ సూచనలను పాటించి గ్రామ పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణకు సహకరించాలని కోరారు.