తండ్రి, నటుడు కమల్ హాసన్ లోని వైవిధ్యాన్ని విలక్షణతను తనకు ఆపాదించుకుని శ్రుతిహాసన్ రంగుల ప్రపంచంలో ముందుకు సాగుతోంది. మంచి అవకాశాలొస్తే హాలీవుడ్ లో నటించేందుకైనా శ్రుతిహాసన్ సిద్ధమే. అలాంటి ఒక అవకాశం తనని వరించింది. అది కూడా తన స్వస్థలం చెన్నై కథతో హాలీవుడ్ దర్శకుడు తెరకెక్కించే సినిమాలో నటించేందుకు అంగీకరించింది.
కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి అనూహ్యంగా శ్రుతి తప్పుకుంటోందని తెలిసి అభిమానులు ఖంగు తిన్నారు. అందాల శ్రుతి హాసన్ బాఫ్టా విజేత ఫిలిప్ జాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న అంతర్జాతీయ ప్రాజెక్ట్ చెన్నై స్టోరీ షూటింగ్ ప్రారంభించినట్లు సంతోషకరమైన వార్త వెలువడింది. కానీ ఇంతలోనే ఈ చిత్రం నుంచి శ్రుతిహాసన్ తప్పుకున్నట్లు కథనాలొస్తున్నాయి. ఇదే నిజమైతే శ్రుతి లేని లోటును ఎవరు భర్తీ చేస్తారో చూడాలి.
ఈ ప్రాజెక్ట్ కోసం సమంతా రూత్ ప్రభు మొదటి ఎంపిక కావడం గమనార్హం. కానీ చివరికి శ్రుతిని ఫైనల్ చేసారు. చెన్నై స్టోరీ టైటిల్ కి తగ్గట్టే చెన్నైకి చెందిన యువతీయువకుల కథతో రూపొందనుంది. వివేక్ కల్రా, నిమ్మి హరస్గమా, సహానా వాసుదేవన్ సహా మరికొందరు నటించనున్నారు. ప్రస్తుతం తను హాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి అర్థాంతరంగా తప్పుకోవడానికి కారణమేమిటి? అన్నది వెల్లడి కాలేదు.