Photo Gallery | శ్రీదేవి, భూదేవి సమేతంగా.. తిరుమలలో స్వర్ణ వైభవం
- శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి దివ్య విహారం
- గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమాడ వీధులు
- రథాన్ని లాగిన మహిళా భక్తులు
తిరుమల, ఆంధ్రప్రభ: తిరుమల కొండపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం నిర్వహించిన స్వర్ణరథోత్సవం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు రథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన స్వర్ణరథోత్సవం మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల నడుమ వైభవంగా సాగింది. స్వర్ణకాంతులతో మెరిసిన రథంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఉత్సవంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్ణరథాన్ని లాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
స్వర్ణరథంపై స్వామివారి దివ్యదర్శనం సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, నన్నపనేని సదాశివరావు, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






