Petrol, Diesel Price Hike | వాహనదారులకు షాక్
Petrol, Diesel Price Hike | వాహనదారులకు షాక్
పెరిగిన ధరలు నేటి నుంచే అమలు
Petrol, Diesel Price Hike | న్యూఢిల్లీ, అక్టోబర్ 3 (ఆంధ్రప్రభ): వాహనదారులకు నయారా ఎనర్జీ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా తన పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు శనివారం తెల్లవారుజాము నుంచే అమల్లోకి వచ్చాయి. నయారా ఎనర్జీకి దేశవ్యాప్తంగా ఉన్న 7,108 ఇంధన కేంద్రాల్లో కొత్త ధరలు అమలవుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు, శుద్ధి చేసిన ఇంధన ఉత్పత్తుల ధరలు పెరగడంతో పెరుగుతున్న వ్యయాలను భర్తీ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది రెండోసారి పెంపు
నయారా ఎనర్జీ ఈ ఏడాది పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ఇది రెండోసారి. గతంలో మార్చి 26న పెట్రోల్, డీజిల్‌పై ఇదే స్థాయిలో అంటే వరుసగా రూ.5, రూ.3 చొప్పున పెంచింది. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ఇంధన సరఫరాలకు అంతరాయం ఏర్పడటంతో అప్పట్లో అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరిగాయి. అయితే ఆ తర్వాత ముడిచమురు ధరలు తగ్గడంతో జూలై 1న మార్చిలో పెంచిన ధరలను నయారా ఎనర్జీ వెనక్కి తీసుకుంది. ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో ధరలను పెంచింది.
ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం స్థిరంగా..
నయారా ఎనర్జీ ధరలు పెంచినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలు మాత్రం ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను మార్చలేదు. దేశవ్యాప్తంగా 1,04,137కు పైగా పెట్రోల్ బంకులు ఉండగా.. వీటిలో 90 శాతానికి పైగా ప్రభుత్వ రంగ సంస్థల ఆధీనంలోనే ఉన్నాయి. దీంతో నయారా బంకుల్లో పెరిగిన ధరలు, ప్రభుత్వ రంగ సంస్థల బంకుల్లో కొనసాగుతున్న ధరల మధ్య వ్యత్యాసం ఏర్పడే అవకాశం ఉంది.
