కూటమి పాలనపై ప్రజల్లో నమ్మకం

ప్రజల కష్టాల్లో అండగా ఉంటా..
ప్రజా సంక్షేమమే లక్ష్యం
ఎంపీ కేశినేని చిన్ని..

తిరువూరు, ఆంధ్రప్రభ: పార్లమెంట్‌ సమావేశాల కారణంగా గతంలో తిరువూరులో జరిగిన కొన్ని ప్రైవేటు కార్యక్రమాలకు హాజరు కాలేకపోయానని, అందుకే ఇప్పుడు వచ్చి ఆయా కుటుంబాలను స్వయంగా కలుస్తున్నానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) తెలిపారు. బుధవారం తిరువూరులో విస్తృతంగా పర్యటించిన ఆయనకు టీడీపీ నేతలు, కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించడంతోపాటు శుభకార్యాలకు హాజరై ఆత్మీయంగా కలుసుకున్నారు. తిరువూరులోని గుళ్లపల్లి ఎన్‌క్లేవ్‌లో గండ్ర హరినాథ్‌ను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం యాండ్రాతి కిరణ్‌,మాధవి దంపతుల కుమారుడు, కుమార్తె ఓణీలు, పంచెల కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందుకు నేడు వారి నివాసానికి వెళ్లి చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఏపీ హజ్‌ కమిటీ డైరెక్టర్‌ షేక్‌ అబ్దుల్‌ హుస్సేన్‌ కుటుంబ సభ్యులను కలుసుకుని ఆయన మనుమరాలికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

సీఎంఆర్‌ఎఫ్‌తో బాధితులకు అండ..

కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం దిశగా పనిచేస్తోందని ఎంపీ చిన్ని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుమ్మరిపాలెం, కలగర గ్రామాలకు చెందిన ఇద్దరు అర్హులైన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ఎల్‌వోసీలను అందజేశారు. టీడీపీ యువ నాయకుడు, ఎన్‌ఆర్‌ఐ వల్లభనేని గిరిబాబు, విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు దృష్టికి బాధితులు తమ సమస్యలను తీసుకురావడంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు.

పవన్‌ జన్మదిన వేడుకల్లో..

తిరువూరులోని జనసేన కార్యాలయంలో జనసైనికులు ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకల్లో ఎంపీ చిన్ని పాల్గొని కేక్‌ కట్‌ చేసి ఎంపీ కేశినేని చిన్ని శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మంచి పరిపాలన సాగుతోందని పేర్కొన్నారు. కష్టకాలంలో పవన్‌ కళ్యాణ్‌ తమకు అండగా నిలిచారని గుర్తుచేస్తూ జనసేన, బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పవన్‌ అడుగుజాడల్లో యువత నడవాలని ఆకాంక్షించారు. తిరువూరులో జనసేన కార్యాలయం ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమని జనసైనికులను అభినందించారు.