మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల మహాశివరాత్రి జాతర సందర్భంగా వనదుర్గభవాని మాతకు రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పట్టు వస్త్రాలు సమర్పించారు..
ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు, ఆలయ ఈవో చంద్ర శేఖర్ ఘన స్వాగతం పలికారు. మంజీరా నది పాయలలో ఏర్పాటు చేసిన శివుడు, లింగం, గోవుల భారీ సెట్టింగ్. వద్ద మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరకు శ్రీకారం చుట్టారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ అమ్మవారి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. అమ్మవారి ఆలయంలో శివరాత్రి జాగారాలు, పూజలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు..
ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయని తెలిపారు. భక్తులు మెచ్చే కోరిన కోరికలు తీర్చే దేవతగా పిలవబడే వనదుర్గ అమ్మవారి జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పిల్లాపాపలతో జాతరకు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోతాయన్నారు. వనదుర్గ అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, జాగారాలు ఉండేందుకు భక్తులు చేరుకున్నారని వివరించారు. వీరంతా వనదుర్గ గుడి ప్రదేశంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్ల కింద బస చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, బస్సులు, విద్యుత్ దీపాలతో అలంకరణ, భక్తులకు త్వరగా దర్శనం కల్గించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రమంలో ఏడుపాయల్లో భక్తుల రద్దీ నెలకొందని చెప్పారు. జాతర సందర్భంగా వనదుర్గా భవాని మాత ప్రధాన ఆలయాన్ని, మండపాన్ని, ధ్వజస్తంభాన్ని రంగు రంగుల పువ్వులతో శోభాయమానంగా అలంకరించాలన్నారు.
ఏడుపాయల మహా జాతర ప్రధానంగా మూడు రోజులు జరుగుతుంది. నేడు మహాశివరాత్రి, రెండో రోజు జాతర వేడుకల్లో ప్రధాన ఘట్టమైన బండ్ల బోనాలు ఊరేగింపు, మూడో రోజు ఆదివారం రథోత్సవం ఉంటాయన్నారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను కలెక్టర్ నేతృత్వంలో సంబంధిత ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తాగునీటి వసతి, టాయిలెట్లు, బస్సులు, హెల్త్ క్యాంప్ లు, గజ ఈతగాళ్లు ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి చంద్రశేఖర్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.