గంజాయి విక్రేతకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష

రూ.10 వేల జరిమానా విధించిన పెద్దపల్లి జిల్లా కోర్టు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : గంజాయి విక్రయిస్తున్న వ్యక్తికి పెద్దపల్లి జిల్లా కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించింది. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు వివరాలు వెల్లడించారు.

పెద్దపల్లి పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన ముత్తునూరి ప్రభాకర్ అలియాస్ నగేష్ (19) 2021లో ఎల్లమ్మ ఆలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అప్పటి ఎస్సై కే.రాజేష్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అతడి వద్ద రెండు కిలోల గంజాయి లభించడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి, దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.

కేసు విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి కే.సునీత నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకన రవి కీలక పాత్ర పోషించారు.

పెద్దపల్లి డీసీపీ బి.రామ్‌రెడ్డి, ఏసీపీ జి.కృష్ణ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ కే.ప్రవీణ్‌కుమార్, కోర్టు కానిస్టేబుల్ గడ్డం మల్లేష్, సీఎంఎస్ హెచ్‌సీ పి.కోటేశ్వరరావు కేసు విచారణకు సహకరించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రాసిక్యూషన్ బృందాన్ని అభినందించారు.