Peddapalli | ఎల్ ఆర్ ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీ – రేవంత్ పై బండి ఆగ్రహం
ఉచితమని చెప్పి డబ్బులు వసూలు చేస్తారా
బర్త్, డెత్ రెగ్యులరైజేషన్ స్కీములు కూడా పెడతారేమో
కాంగ్రెస్ స్కాములకు బిజెపి పోరాటాలకు మధ్య ఎన్నికలు
పెద్దపల్లి , ఆంధ్రప్రభ – ఎల్ఆర్ఎస్ స్కీమ్ తో తెలంగాణ ప్రభుత్వం 50 వేల కోట్ల దోపిడీకి సిద్ధమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సమయంలో ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించిన ఆడియో, వీడియోలను మీడియాకు విడుదల చేశారు.
అనంతరం మాట్లాడుతూ , ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. బర్త్, డెత్ రెగ్యులరైజేషన్ స్కీంలను కూడా ప్రవేశపెడతారేమో అన్నారు. కేంద్ర బడ్జెట్ పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలన్నారు. మీకు చేతనైతే బీసీ రిజర్వేషన్లపై టెన్ జనపథ్ ఎదుట ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ పోరాటాలకు మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 15 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని, నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట ముంచారన్నారు. 4000 పింఛన్ ఏమైందని, కల్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడూ ఇస్తారని, ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఎప్పటినుండి అందిస్తారని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది అన్నారు. రైతు భరోసా అమలు చేయడం లేదన్నారు.
నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన బిజెపి పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్ళినాడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎక్కడికి పోయారన్నారు. ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే సీఎం తో పాటు మంత్రులు ఆరోజు ఎందుకు నిరసన కార్యక్రమాలు పాల్గొనలేదన్నారు. ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఉపాధ్యాయ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలనన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి, అలజపూర్ శ్రీనివాస్ తో పాటు పెద్ద సంఖ్యలో బిజెపి శ్రేణులు పాల్గొన్నారు