విజయం సాధించాలన్న పట్టుదల, కృషి విద్యార్థుల్లో ఉండాలి

అధ్యాపకుడిగా మారిన మంత్రి పయ్యావుల కేశవ్

ఉరవకొండ, ఆంధ్రప్రభ : ఉరవకొండ పర్యటనలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బుధవారం ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా బీకాం ప్రథమ సంవత్సరం విద్యార్థులు చదువుతున్న తరగతి గదిలోకి వెళ్లిన మంత్రి కొంతసేపు అధ్యాపకుడిగా మారి విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు జీవితానికి ఉపయోగపడే విలువైన విషయాలను బోధించారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించాలన్న కసి, పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. జీవితంలో ఎదురయ్యే అవమానాలు, అపజయాలతో కుంగిపోకుండా వాటినే విజయానికి మెట్లుగా మార్చుకోవాలని స్ఫూర్తినిచ్చారు.

తాను కూడా పాఠశాల స్థాయిలో ఒక సందర్భంలో అవమానాన్ని ఎదుర్కొన్నానని, అయితే ఆ సంఘటనను సవాలుగా తీసుకుని కేవలం మూడు నెలల్లోనే తన సత్తా చాటుకున్నానని మంత్రి తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఎవరైనా మనల్ని తక్కువగా అంచనా వేసినప్పుడు నిరుత్సాహపడకుండా.. మనలోని ప్రతిభను నిరూపించుకునే అవకాశంగా భావించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు సైతం ప్రతిభలో ఎవరికీ తీసిపోరని, సరైన లక్ష్యం, కష్టపడే తత్వం ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.

స్వయంగా తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మమేకమై పాఠ్యాంశాలతో పాటు జీవిత పాఠాలను బోధించడం వారిలో ఉత్సాహాన్ని నింపింది. విజయం అదృష్టంతో వచ్చేది కాదని.. లక్ష్యం, కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో సాధించేదనే సందేశాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ అందించారు.