పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకలు.. కోలాహలంగా అభిమానుల సంబరాలు

కేక్‌ కటింగ్‌లు.. భారీ ర్యాలీ.. 3 వేల మందికి అన్నదానం

నర్సాపురం, సెప్టెంబరు 2 (ఆంధ్రప్రభ): ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలను నర్సాపురంలో అభిమానులు, పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన సెంటర్‌లో నిర్వహించిన కేక్‌ కటింగ్‌ కార్యక్రమానికి జనసేన నాయకులు, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు.

ఈ సందర్భంగా జనసేన నాయకుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ చాగంటి మురళీకృష్ణ (చిన్న) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన నివాసం నుంచి అభిమానులతో కలిసి ర్యాలీగా బయలుదేరిన నాయకులు నర్సాపురం బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకున్నారు.

3 వేల మందికి అన్నదానం

బస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరంలో సుమారు 3 వేల మందికి చాగంటి మురళీకృష్ణ (చిన్న), ఆయన సోదరుడు చాగంటి పార్థసారథి అన్నదానం చేశారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

సేవా కార్యక్రమాలను అభినందించిన కూటమి నేతలు

కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ బొమ్మిడి నాయకర్‌, మాజీ మంత్రి, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ షరీఫ్‌, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చాగంటి సోదరులు చేపట్టిన సేవా కార్యక్రమాలను వారు అభినందించారు.

కార్యక్రమంలో మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ కొల్లు పెద్దిరాజు, కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.