Pawan Kalyan | ప్రజా కంటకుడిపై వీరమల్లు వీరోచిత పోరాటం అబ్బురపరుస్తుంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ ఎన్నో ఆటంకాలు, సవాళ్లను దాటుకుని, చివరికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. విశాఖపట్నంలో బుధవారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన ప్రయాణం, చరిత్రపై అండగా నిలిచే ఈ సినిమాలోని విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.

ఇతిహాసానికి కల్పిత రూపం

హిందువుగా జీవించాలంటే జిజియా పన్ను కట్టాలి అనే కట్టడపు పాలనను ఎదుర్కొని, కోహినూర్ వజ్రాన్ని మళ్ళీ పొందే యోధుడి కథే హరిహర వీరమల్లు. కొల్లూరులో దొరికిన కోహినూర్ గోల్కొండ నుంచి ఢిల్లీ వరకు వెళ్లి, చివరికి బ్రిటన్ చేరిన చరిత్రలోని అసలు వాస్తవాన్ని క్రమంగా చూపించడానికి ఈ సినిమాను రూపొందించినట్టు పవన్ తెలిపారు. ప్రజా కంటకుడైన ఔరంగజేబును ఎదుర్కొని కోహినూర్ ను వెనక్కి తీసుకురావాలనే యోధుడి కల్పిత పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు.

అద్భుత సంగీతానికి కీరవాణి గారి ముద్ర

ఎం.ఎం. కీరవాణి లేకుండా హరిహర వీరమల్లు ఉండేది కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రతి ఎమోషన్‌కి ప్రాణం పోసే విధంగా కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరింత బలాన్నిచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. “నాటు నాటు”కు ఆస్కార్ రావడం ఒక చరిత్ర అయితే, ఈ చిత్ర సంగీతం కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల గుండెల్లో నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ కు విశాఖతో విడదీయరాని బంధం

తన నటనకు పునాది వేసింది ఉత్తరాంధ్ర నేలే అని గుర్తు చేసిన పవన్, సత్యానంద్ వద్ద శిక్షణ పొందిన రోజులను గుర్తు చేసుకున్నారు. నటనతో పాటు ధైర్యం, జీవిత పాఠాలు విశాఖ నేర్పిందని, అదే తనకు భవిష్యత్తులో ప్రతి సమస్యను ఎదుర్కొనే శక్తిని ఇచ్చిందని చెప్పారు. “నేను నటనలో ఓనమాలు దిద్దుకున్న నేల విశాఖ. ఆ నేలకే ఈ విజయాన్ని అర్పిస్తాను” అని పవన్ స్పష్టం చేశారు.

నేను పవనం… వాళ్లు బావిలో కప్పలు

పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్తే ఆ ఊరు నాదే అని చెబుతాడని విమర్శిస్తుంటారు. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మేము ఉండాల్సి వచ్చింది. అందుకే అన్ని ఊర్ల పేర్లు చెబుతాను. నా పేరు పవనం… తిరుగుతూ ఉంటాను. మనల్ని విమర్శించే వాళ్లు కూపస్థ మండూకాలు.. అంటే బావిలో కప్పలు. బావిలో ఒక గీరి గీసుకొని కూర్చొనే కప్పలకు ఏమీ తెలుస్తుంది పవనం తాలూకా శక్తి? వాటికి ఎంత చెప్పినా అర్థం చేసుకోలేవు. అని త‌న విమ‌ర్శ‌కుల‌కు కౌంట‌ర్ ఇచ్చారు ప‌వన్.

ఉత్తరాంధ్ర ఆటపాట్లే కాదు… ఇక్కడ జరిగిన ఎన్నో సంఘటనలు నాకు గుండెల్లో గుర్తుండిపోయాయి. రెండేళ్ల క్రితం జనవాణి కార్యక్రమం కోసం విశాఖకు వస్తే ఎన్నో ఆంక్షలు విధించారు. కారు నుంచి బయటకు రాకుండా చేశారు. హోటల్ ఉంటే రాత్రంతా భయబ్రాంతులకు గురి చేశారు. బూటు కాళ్లతో డోర్లను తన్నుతూ రెచ్చిపోయారు. నన్ను బలవంతంగా నిర్బంధిస్తే మొత్తం విశాఖ ప్రజానీకం తరలివచ్చి నోవోటెల్ ముందు కూర్చుంది. అంత బలమైన జ్ఞాపకాలు ఇచ్చింది విశాఖపట్నం. అందుకే ఈ ఫంక్షన్ ఇక్కడ పెట్టాలని నిర్ణయించాను.

మన సినిమా టికెట్ రూ.10 చేశారు

గత ప్రభుత్వ హయాంలో అందరి హీరోల సినిమాలకు ఒకలా టికెట్ల రేట్లు పెంచిన ప్రభుత్వం… పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం టికెట్ల రేటును రూ. 10కు తగ్గించేది. అలాంటి పరిస్థితుల్లో కూడా బీమ్లా నాయక్ వంటి సినిమాను అభిమానులు విజయవంతం చేశారు. కూటమి ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ శాఖ జనసేన వద్దే ఉన్నా… టికెట్ల రేట్లు పెంపు విషయంలో నాకు సంబంధం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకోవాలని నిర్మాతకు చెప్పాను. ఆయన కూడా అందరి హీరోలకు ఇచ్చినట్లు మా సినిమాకు కూడా రేట్లు పెంపునకు సహకరించారు.

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్… పవనన్న సినిమా మంచి విజయం సాధించాలని ట్విట్ చేశారు. ఆయనకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. సినిమా పరిశ్రమకు వచ్చి దాదాపు 30 ఏళ్లు అయ్యింది. ఏ రోజూ ఎవరినీ ఏదీ అడిగిన పాపాన పోలేదు. నాకు ఇవ్వడం తెలుసు కానీ అడగడం తెలియదు. మారుమూల గిరిజన గ్రామాలకు డోలీ మోతలు లేకుండా రోడ్లు వేయడం తెలుసు తప్ప నా కోసం ఇది చేయండి అని అడగడం తెలియదు. నేను అడగకపోయినా నా అభిమానులకు నాకు ఇస్తారని తెలుసు. అని అన్నారు.

చివరి యాక్షన్ సీన్లు స్వయంగా తెరకెక్కించా

మార్షల్ ఆర్ట్స్‌ లో త‌ను నేర్చుకున్న ప్రతిభకు ఈ సినిమాలో నిలువెత్తు సాక్ష్యం ఉంటుందన్నారు ప‌వ‌న్. “చివరి 18 నిమిషాల యాక్షన్ సీన్లకు తానే దర్శకత్వం వహించిన‌ట్టు తెలిపారు. పూర్తి స్థాయిలో రియలిస్టిక్ గా తీర్చిదిద్దాం. ఆ సీన్లకు కీరవాణి సంగీతం జోడైతే, ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతి కలుగుతుంది” అన్నారు.

రెండు భాగాలుగా వీరమల్లు

‘హరిహర వీరమల్లు’ కథ రెండు భాగాలుగా రూపొందించిన‌ట్టు.. మొదటి భాగం ఎర్రకోట వద్ద ముగుస్తుంది. వీరమల్లు ఔరంగజేబును కలుస్తాడా? కోహినూర్ వజ్రం ఎలా సాధిస్తాడు? అనే క్లైమాక్స్ తో రెండో భాగానికి దారితీస్తుంది.

సినిమా, రాజకీయాలపై వ్యక్తిగత అభిప్రాయాలు

“సినిమా నాకు కేవలం వ్యాపారం కాదు. నాకు ఉన్న శక్తి, సంపద, సినిమా అభిమానులు ఇచ్చారు. కులం, మతం, ప్రాంత బేధాలు లేవు. సినిమాకు సమకాలీన రాజకీయాల్లో తేడా లేదు. ప్రజా సమస్యల గురించి చెప్పాలనేది నా లక్ష్యం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

భగవంతుడి మీద విశ్వాసం

“గతంలో గబ్బర్ సింగ్ సమయంలో ఒక విజయం ఇవ్వమని భగవంతుడిని ప్రార్థించా. ఇప్పుడు కూడా హరిహర వీరమల్లు చిత్రం విజయం సాధించి ప్రతి అభిమానిని ఆనందింప చేయాలని కోరుకుంటున్నాఅని ప‌వ‌న్ అన్నారు.

ఇతిహాసం, యాక్షన్, సంగీతం, విలువలు ఇవన్నీ ఒకే చాటులో ‘హరిహర వీరమల్లు’ లో మిళితమై ఉంటాయని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. కీరవాణి సంగీతం, శక్తివంతమైన కథనం, యథార్థ యాక్షన్ – ఇవన్నీ కలిపి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపే అంశాలుగా నిలుస్తాయని ఆయన అన్నారు.

Leave a Reply