ఘనంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు
సేవా కార్యక్రమాలతో జనసేన సందడి.. రక్తదాన శిబిరం, మొక్కల నాటకం
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మేడ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మేడ రామకృష్ణ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు జిల్లా వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా సామాజిక, పర్యావరణ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు.
వేడుకల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. నిర్వహించిన రక్తదాన శిబిరంలో మేడ రామకృష్ణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
అనాథాశ్రమ పాఠశాలలో విద్యార్థులు, చిన్నారులకు పండ్లు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. పేదలు, నిరుపేదల సంక్షేమం కోసం పవన్ కల్యాణ్ చూపుతున్న మార్గంలో నడుస్తూ ప్రజలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని జనసేన నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పెందం హైందవి రెడ్డితో పాటు జిల్లా నాయకులు రాఘవేందర్, చిల్లా జనార్దన్‌రెడ్డి, శ్రీవల్లి, కనకదుర్గ తదితరులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
