ప్రజా నాయకుడిగా పవన్‌ కళ్యాణ్‌ ప్రస్థానం స్ఫూర్తిదాయకం: విక్కుర్తి

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన పవన్‌ కళ్యాణ్‌
కూటమి విజయానికి కీలక పాత్ర.. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం

అవనిగడ్డ, ఆంధ్రప్రభ: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి విక్కుర్తి శ్రీనివాసరావు కేక్‌ కట్‌ చేసి నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినీ నటుడిగా విశేష ప్రజాదరణ పొందిన పవన్‌ కళ్యాణ్‌ ప్రజా సమస్యలపై స్పందిస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, 2014లో జనసేన పార్టీని స్థాపించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడారని తెలిపారు. 2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎదురైనా ప్రజలకు దూరం కాకుండా వారి సమస్యలపై పోరాడారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటులో పవన్‌ కళ్యాణ్‌ కీలక పాత్ర పోషించారని, జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించడం ఆయన నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనమన్నారు.

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని విక్కుర్తి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించడం, అనంతరం గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు చేపట్టడం వంటి కార్యక్రమాలను ఆయన వివరించారు. గ్రామసభల్లో ప్రజలు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించడంతో పాటు సుమారు 30 వేల అభివృద్ధి పనులకు రూ.4,500 కోట్ల మేర నిధులు కేటాయించడం గ్రామీణాభివృద్ధిపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రజా సేవ, గ్రామీణాభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పవన్‌ కళ్యాణ్‌ ముందుకు సాగుతున్నారని పేర్కొంటూ ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు పాల్గొన్నారు.