పార్ట్‌టైమ్‌ టీచర్ల పోస్టులకు దరఖాస్తులు

18లోగా దరఖాస్తులు..
19న డెమో, ఇంటర్వ్యూలు

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన పార్ట్‌టైమ్‌ టీచర్లను నియమించేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 18న సాయంత్రం 4 గంటల్లోగా చిట్కుల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సమర్పించాలని సూచించారు.

ఈ నెల 19న ఉదయం 10 గంటలకు అదే పాఠశాలలో డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, రెండు తాజా పాస్‌పోర్టు సైజు ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు.